Telangana Formation Day Arrangements : తెలంగాణలో జూన్ 2వ తేదీన రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్‌కుమార్ ఆదేశించారు. వేడుకలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలపై శుక్రవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో సీఎస్ మాట్లాడారు.
‘‘జూన్ 2న ఉదయం సీఎం కేసీఆర్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం రవీంద్రభారతిలో 30 మంది ప్రముఖ కవులతో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం’’ అని సీఎస్ వివరించారు.
Telangana Formation Day Arrangements 2022 : రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే మంత్రులు, ఇతర ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొని పతాకావిష్కరణ చేసే వారి పేర్ల వివరాలతో సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలను పురస్కరించుకుని ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల అధికారులు తమ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.