Telangana Chief Secretary News : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐసీ) పనులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కొనసాగించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదంటూ చెన్నై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు.
Telangana CS Filed Affidavit in NGT : గత ఏడాది అక్టోబరు 29న పనులను నిలిపివేయాలంటూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే చీఫ్ ఇంజినీర్లు తమ పరిధిలోని సూపరింటెండింగ్ ఇంజినీర్లకు లేఖలు రాసి పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. నవంబరు 11 నుంచి 29లోగా పనులను సురక్షిత స్థాయికి తీసుకువచ్చి నిలిపివేసినట్లు సీఎస్ తెలిపారు. ఆయనతోపాటు పీఆర్‌ఎల్‌ఐసీ 1 నుంచి 12 ప్యాకేజీలను పర్యవేక్షిస్తున్న నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీరు మహమ్మద్ అబ్దుల్ హమీద్ ఖాన్, 13 నుంచి 18 ప్యాకేజీలను పర్యవేక్షిస్తున్న మహబూబ్‌నగర్ సీఈ వి.రమేశ్‌లు విడివిడిగా అఫిడవిట్‌లు దాఖలు చేశారు. ఉత్తర్వులు అందిన వెంటనే నిర్మాణాలను సురక్షిత స్థాయికి తీసుకువచ్చి నిలిపివేయాలని లేఖ రాశామన్నారు. ఎన్జీటీ ఉత్తర్వుల అమలుకు సురక్షిత స్థాయికి తీసుకురావడంలో భాగంగా కొన్ని రోజులపాటు పనులను కొనసాగించినందుకు బేషరతు క్షమాపణ కోరుతున్నట్లు సీఈలు పేర్కొన్నారు. పీఆర్‌ఎల్‌ఐసీ పనులను అనుమతుల్లేకుండా చేపడుతున్నారని పేర్కొంటూ కడపకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించిన విషయం విదితమే.