Contract Teachers in Telangana : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 58 ఏళ్లు దాటిన కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు ఇవ్వొద్దని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు ప్రభుత్వం గతంలోనే పెంచిన సంగతి తెలిసిందే. అది ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకూ వర్తింపజేశారు. దాన్ని కాంట్రాక్టు అధ్యాపకులు, ఇతర పొరుగు సేవల సిబ్బందికి వర్తింప చేస్తూ ఉత్తర్వులు వెలువడలేదు. దీనిపై ఇంటర్ విద్యాశాఖ గత నవంబరు 8న ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు.
ఈ క్రమంలో 58 ఏళ్లు దాటిన వారికి వేతనాలు ఇవ్వొద్దని జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులను కమిషనర్ ఆదేశించారు. విరమణ వయసుపై ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గత నెలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అధ్యాపకులు మాత్రం యథావిధిగా విధులకు హాజరవుతున్నారు.