మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మాజీ మంత్రులు కె. జానారెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి.. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ, దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ.. మృతి దేశానికి తీరనిలోటని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. భారత రాజకీయాల్లో ఐదు దశాబ్దాలపాటు సేవలందించిన ముఖర్జీ.. తనదైన ముద్రవేశారన్నారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా.. అనేక సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలకపాత్ర పోషించారని.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చేందుకు సహకరించారని తెలిపారు.
ఇవీచూడండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం