ఝార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. బంగారు తెలంగాణ నిర్మాత , జాతీయ ఫెడరల్ నేత అంటూ కేసీఆర్‌కు ఝార్ఖండ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాంచీ విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ నేరుగా బిర్సా ముండా చౌక్‌కు చేరుకుని అక్కడ అన్న గిరిజన ఉద్యమ నేతకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత సీఎం హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంటారు. ఈ భేటీలో దేశ రాజకీయాలు, భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలను చర్చించనున్నారు.
అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం..
గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారికి సాయం అందించనున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను సోరేన్‌తో కలిసి కేసీఆర్ అందిస్తారు. చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన కర్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ఈ సందర్భంగా అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ఝార్ఖండ్‌లో సైనికుల కుటుంబాలకు సాయం చేస్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత మిగిలిన ప్రాంతాల్లో ప్రకటించి.. ఆయా రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు.