వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సత్వరమే సాగునీరు అందించే లక్ష్యంతో నీటిపారుదల శాఖ కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల శాఖ బడ్జెట్‌పై శుక్రవారం.. సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆవసరాలపై ఆరా..
జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఇతర అధికారులతో సమావేశమై.. సంబంధిత అంశాలపై చర్చించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, అందుబాటులో ఉన్న నిధులు, వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు, మార్జిన్ మనీ, తదితర అంశాలను సమీక్షించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరాలపై ఆరాతీశారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్..
ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. అటు ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవసరాలను గుర్తించి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సూచించారు.
గోదావరిలో వచ్చే వివిధ నీటి ప్రవాహాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్వహణ, ఎత్తిపోతలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కాళేశ్వరం ఎత్తిపోతలతోపాటు పలు ప్రధాన ప్రాజెక్టులకు అవసరం ఉన్నంత మేరకు నిధులు కేటాయించనున్నారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని.. వాటి కింద ఉన్న అవరోధాలను అధిగమించాలని సీఎం సూచించినట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కేటాయింపులపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల నీటిపారుదలశాఖను పునర్ వ్యవస్థీకరించి భారీ, మధ్య, చిన్నతరహా విభాగాలను ఓకే గొడుకు కిందకు తెచ్చిన విషయం తెలిసింది. ఈ క్రమంలో సీఈలలో పరిధిలో ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులు ఎంత మేరకు నిధులు అవసరం, భూ సేకరణ పునరావాస కల్పనకు సంబంధించి కేటాయింపులు, ఇతర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.
ఇవీచూడండి: రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు వేగవంతం