CM KCR Delhi Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి దిల్లీకి చేరుకున్నారు. సీఎం వెంట సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, తెరాస పార్లమెంటరీపక్ష నేత కె.కేశవరావు తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య తీవ్రరూపం దాలుస్తుండగా.. సోమవారం నుంచి తెరాస విస్తృతస్థాయి ఆందోళనల నేపథ్యంలో కేసీఆర్ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన దిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లను కలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎంవో ప్రధాని, కేంద్ర మంత్రి కార్యాలయాలను అపాయింట్‌మెంట్ సైతం కోరింది. అది లభించనిపక్షంలో దిల్లీ కేంద్రంగా ఈ అంశంపై వివిధ పార్టీల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం దంపతులు దిల్లీలో వైద్య పరీక్షలు కూడా చేయించుకోనున్నారని తెలిసింది.
ఉప్పుడు బియ్యం కొనేది లేదని తాజాగా తేల్చడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెరాస సోమవారం నుంచి 11వ తేదీ వరకు వివిధ ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. అందులో భాగంగా 11న దిల్లీలో పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష ఉంది. సీఎం అందులో పాల్గొంటారా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మూడు రోజుల పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు వచ్చి మళ్లీ పదో తేదీన దిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీచూడండి: KTR On Protests: 'మోదీకి సెగ తగిలేలా.. తెలంగాణ తడఖా చూపించాలి'