Gangula on Paddy Procurement: కేంద్రం మోకాలడ్డినా రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణలో రికార్డు స్థాయి కొనుగోళ్లు నమోదు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ కార్యకలాపాలపై మంత్రి సమీక్షించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్‌రెడ్డి, రుక్మిణి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జనరల్ మేనేజర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2021-22 సంవత్సరంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ పురోగతి, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విస్తృతంగా చర్చించారు. కేంద్రం సహకరించకున్నా.. సీఎం ఆదేశాలతో రాష్ట్ర రైతుల పక్షాన నిలిచి ధాన్యం సేకరించామని మంత్రి అన్నారు. ధాన్యం సేకరణ లక్ష్యం దాదాపు పూర్తి కావచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సమానమైన.. 68.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా జనవరి 3 వరకు 65.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి గంగుల వెల్లడించారు. మిగతా ధాన్యం ఎంత వచ్చినా సేకరిస్తామని స్పష్టం చేశారు.
దాదాపు 6,868 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించామన్నారు. వీటిలో 4,808 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తై మూసివేశామని చెప్పారు. దాదాపు 11 లక్షల 90 వేల మంది రైతుల నుంచి రూ.12,761 కోట్ల విలువ గల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు. 8 లక్షల మందికి రూ.10,394 కోట్ల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామని మంత్రి తెలిపారు. భారత ఆహార సంస్థ (FCI)కు కస్టమ్ మిల్లింగ్ రైస్(CMR) అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ వానాకాలానికి సంబంధించి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తామని మంత్రి గంగుల పేర్కొన్నారు.
ఇదీచూడండి: Kishan Reddy on Bandi Sanjay Arrest : 'ధర్నాచౌక్ కేసీఆర్ కోసమేనా.. ప్రతిపక్షాలు ఆందోళన చేయకూడదా?'