ప్రగతిభవన్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, తద్వారా ఉత్పన్నమైన పరిస్థితులపై భేటీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న స్థితి, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ దృష్టి సారించనుంది.
పాజిటివ్ కేసులు వచ్చిన 101 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా భేటీలో చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ప్రధానమంత్రికి ఇప్పటికే సూచన చేసిన కేసీఆర్.. కేంద్రం అంగీకరించకపోయినా రాష్ట్రంలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కొనసాగింపుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
పదో తరగతి పరీక్షలపైనా నిర్ణయం..
కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలు ఆకస్మికంగా మూతపడ్డాయి. పదో తరగతి సహా కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యా శాఖ అంశాలు, పరీక్షల విషయం పైనా నేటి భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఖజానాపై భారం..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపింది. ఖజానాకు రాబడులు గణనీయంగా తగ్గాయి. కరోనా పరీక్షలు, వైద్యం సహా పేదలకు బియ్యం, నగదు పంపిణీ వంటి వాటికి రాష్ట్ర సర్కారే ఖర్చుచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి.. భవిష్యత్‌లో అనుసరించాల్సిన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
రాష్ట్రంలోని పేదలు, వలస కార్మికులకు అందుతున్న బియ్యం, నగదు సాయంపై సమీక్షిస్తారు. ధాన్యం, ఇతర వ్యవసాయ పంటల కొనుగోళ్లపైనా చర్చిస్తారు. ధాన్యం సేకరణకు ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ధాన్యం సేకరణకు గోనెసంచుల కొరత ఉన్నందున సమస్య పరిష్కరించాల్సిందిగా ప్రధాని మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
పంట నష్టంపైనా..
బత్తాయి, నిమ్మ పంటలకు మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, కోసే పరిస్థితి కూడా లేకపోవడం ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడి సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుండటం వల్ల పండ్ల అమ్మకాలపైనా ఈభేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం సహా రైతులకు అందించాల్సిన సాయంపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ కొనసాగింపు, కరోనా సంబంధింత అంశాలపైనా చర్చించనున్నారు. ఆ సమీక్షలో రాష్ట్రానికి చెందిన అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.