రోడ్ల మరమ్మతులపై...
"రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఇటీవల జోగిపేటకు వెళ్లిన సమయంలో రోడ్ల దుస్థితిని గుర్తించా. రాష్ట్రంలోని హైవేలు, ఇతర రోడ్లను రెండు మూడు నెలల్లో మరమ్మతులు చేస్తాం. ఇందుకు రూ.571 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నాం. వీలైనంత త్వరగా టెండర్లు పిలుస్తాం. సరిగా పనిచేయని కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వరాదు. మూడు నెలల్లో అన్ని రోడ్లు సాధారణ స్థితికి రావాలి. పాడైన జాతీయ రహదారులను పట్టించుకునే నాథుడే ఉండరు. గతంలో మంత్రిగా ఉన్న గడ్కరీని అడిగితే కొన్ని నిధులు ఇచ్చారు. ఇప్పుడు అవీ రావడం లేదు" అని కేసీఆర్ అన్నారు.
ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక విధానం..
"రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. మన వద్ద మక్కలు 14 లక్షల మెట్రిక్ టన్నులు పండుతుంది. దీనిని కోళ్ల పరిశ్రమ తీసుకుంటుంది. ఈ పరిశ్రమను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. మిగతా కంది, పెసర.. వంటి వాటికి సమస్యలు తక్కువగా ఉన్నాయి. వరిధాన్యం నిల్వ, ధరలు సమస్యగా ఉంది. వీటిని పరిష్కరించేందుకు ఒక మంచి విధానం తెస్తాం. ఇక ఎఫ్‌సీఐకి, కేంద్రానికి ధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే చూసుకుందాం. ఈ సీజన్‌లో రైతులకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పౌరసరఫరాల సంస్థకు రూ.7వేల కోట్లు ఇస్తాం. అవసరమైతే మరో రూ.4వేల కోట్ల గ్యారంటీ ఇస్తాం. కేబినెట్ అనుమతి అవసరం లేకుండా వెంటనే ఈ నిధులు ఇవ్వాలని సూచించా. ఏ జిల్లాలో ఎంత పంట ఉందో లెక్కలు తీసి మంచి ధరలు వచ్చేలా చూడాలి" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
భూగర్భ జలాలు పెరిగాయి...
"నీటిపారుదల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. పాలమూరు జిల్లాలో 12 లక్షల ఎకరాలు సాగవుతోంది. జూరాల, కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్... 1,850 చెరువులు నింపుతున్నాయి. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. రాజరాజేశ్వర ప్రాజెక్టు(మిడ్‌మానేరు) వరకు కాళేశ్వరం విజయవంతంగా నడుస్తోంది. ఏ ప్రాజెక్టు ఏ స్థాయి వరకు నింపాలనే దానిపై ఓ పద్ధతి ఉంటుంది. జలాశయాలపై కనీస పరిజ్ఞానం లేకుండా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. రాజరాజేశ్వర ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. ఇప్పుడు ఎల్లంపల్లి, కడియం నింపుతున్నాం. 15 రోజులు లోడ్ టెస్టింగ్ అయిన తరువాత బయటకు వెళ్తుంది. ఎల్‌ఎండీలో మరో ఐదు టీఎంసీలు నింపుతాం. మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. మార్చి వరకు ఇవ్వాలని కోరుతున్నారు. ఏప్రిల్ వరకూ ఇస్తామని భరోసా ఇచ్చాను. గతంలో సూర్యాపేట జిల్లా రైతులు ఎస్సారెస్పీ జలాల మీద ఆధారపడి ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. త్వరలో దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తవుతాయి."
కార్పొరేషన్ల భర్తీ...
"మూసీ రివర్ ఫ్రంట్, రైతు సమన్వయ సమితి తదితర 28 కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను నియమించాలంటే.. చట్టాలు సవరించాలి. ఇందుకు ఆర్డినెన్సు తెస్తున్నాం. రైతు సమస్యల పరిష్కార వేదికగా రైతు సమన్వయ సమితి నిలుస్తుంది. రైతులకు ఇబ్బంది లేకుండా వచ్చే ఏడాది చట్టం తీసుకువస్తాం. నీటిపారుదలలో విజయం సాధించాం. ఈ విషయంలోనూ విజయం సాధిస్తాం. గతంలో సంక్షోభంలో ఉన్నవారం ... ఇప్పుడు అభివృద్ధి వైపు వెళ్తున్నాం" అని సీఎం చెప్పారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కనున్న ప్రగతి రథ చక్రాలు