Telangana Budget 2022-23 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ ఏడాది పద్దు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
Telangana Budget Sessions 2022-23 : అనతికాలంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రూ.2,56,958,51 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం - రూ.1.89 లక్షల కోట్లు, క్యాపిటల్ వ్యయం - రూ.29,728 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోందని అన్నారు. అవినీతిరహితంగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దరఖాస్తు పెట్టాల్సిన పని లేకుండానే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు.
"రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధించాం. సీఎం ప్రగతిపథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు జరుగుతున్న చరిత్ర."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి