BJP Leaders Met Governor : హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను భాజపా ప్రతినిధుల బృందం కలిసింది. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమిళిసైను కలిసిన వారిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. కాషాయ కార్యకర్తలపై తెరాస నేతలు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని భాజపా నేతలు గవర్నర్‌కు వివరించారు. తెరాస నాయకుల వేధింపులతో ఓ భాజపా కార్యకర్త, మరో ఘటనలో ఓ తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.
సీబీఐ విచారణ జరిపించాలి : రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తన గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ప్రతిపక్ష నాయకులను కౌన్సెలింగ్ పేరుతో హింసిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు విచారణ జరిపితే నిష్పక్షపాతంగా జరగదని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. ఖమ్మం సాయిగణేశ్, కామారెడ్డిలో సంతోశ్, పద్మల ఆత్మహత్య కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
- భాజపా కార్యకర్త ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెరాస వేధింపులే కారణమా.?
- తల్లీకుమారుడి ఆత్మాహుతి.. తమ మరణానికి వారే కారణమంటూ..!
పువ్వాడ రాజీనామా చేయాలి : రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. భాజపా కార్యకర్తలను అణిచి వేస్తున్నారని మండిపడ్డారు. కాషాయ శ్రేణులపై తెరాస దాడులు చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయకపోతే ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని కోరారు.
పోలీసులా.. తెరాస కార్యకర్తలా..? : "తెలంగాణ పోలీసులు తెరాస కార్యకర్తల్లా పని చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా కేసీఆర్ మార్క్ పాలన జరుగుతోంది. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. కేసీఆర్.. రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు."
- పొంగులేటి సుధాకర్ రెడ్డి, భాజపా నేత