Tarun Chug Comments on KCR : భాజపా కార్యకర్తలపై దాడులు చేసి, కేసులు పెట్టి వేధిస్తున్నారని తెరాస సర్కార్‌పై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ మండిపడ్డారు. అవినీతిలో మాత్రమే తెరాస ముందుందని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబ అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. 2024లో తెలంగాణలో.. భాజపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. దిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ భాజపా కోర్ కమిటీతో భేటీ అయ్యారు.
Tarun Chug Comments on TRS Government : ఈ సమావేశంలో బండి సంజయ్‌తో పాటు దిల్లీ వెళ్లిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస దాడులు, ప్రధాని మొదలు రాష్ట్ర నేతలపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ ఛానల్, పేపర్ వ్యవహారం, పార్టీలో అంతర్గత విభేదాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించారు. ప్రధానిపై ప్రివిలేజ్ కమిటీ అంశం, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసే అంశాలపై సమాలోచనలు చేశారు.
"రాష్ట్రాన్ని సాధించుకునే సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక మరిచిపోయారు. తాను అప్పుడు చెప్పిందొకటి.. ఇప్పుడు చేసేదొకటి. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాదు.. అవినీతికి సీఎం అయ్యారు. కేసీఆర్ సర్కార్.. అలీబాబా 40 దొంగల ముఠాగా తయారయింది. వాళ్ల పని ఒకటే.. తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన పన్నులను ఎలా దోచుకోవాలి. చిత్రవిచిత్ర పథకాల పేరిట డబ్బు ఎలా కాజేయాలి."
- తరుణ్‌చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్
"భాజపాను అణిచివేయాలని చూస్తున్నారు. కార్యకర్తలను అణిచివేయాలని, భయపెట్టాలని వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలనే కాదు సామాన్య ప్రజలనూ ఇబ్బంది పెడుతున్నారు. అవాస్తవాలను నిజం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నిజానిజాలేంటో మేం తేలుస్తాం. ప్రజలకు నిజాన్ని మేం చెబుతాం."
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
భేటీ అనంతరం రాష్ట్ర భాజపా నేతలు.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ప్రధాని మాటలను వక్రీకరించారని మీడియాపై గతంలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాపై చేసిన ఫిర్యాదు అంశంపై జోషితో మరోసారి చర్చిస్తున్నారు.
- ఇదీ చదవండి : ఇవాళ బయ్యారంలో తెరాస ఆధ్వర్యంలో ఉక్కు నిరసన దీక్ష..