అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సస్పెండైన భాజపా ఎమ్మెల్యేలు.. హైకోర్టు సూచనతో ఇవాళ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. తొలుత ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్.. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులును కలిసి హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని అందించారు. తర్వాత సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. కోర్టు సూచనలు, తమ అభ్యర్థనను సభాపతి తిరస్కరించారని ఈటల తెలిపారు. అనంతరం స్పీకర్ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తిరిగి వెళ్లిన భాజపా ఎమ్మెల్యేలు.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు... సభ నిర్వహణకు అడ్డుతగులుతున్నారంటూ భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ నిర్ణయంపై భాజపా సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సింగిల్ జడ్జి సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులుపై భాజపా సభ్యులు మరోసారి అప్పీలు చేశారు. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు.. దీనిపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించింది. ఇవాళ ఉదయం శాసన సభ స్పీకర్‌ను కలవాలని సూచించింది. భాజపా సభ్యులు స్పీకర్‌ను కలిపించాలని.. శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. నేటితో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
ఇదీచూడండి: BJP MLAs About Suspension : 'ఈటల ముఖం చూడకూడదనే సభనుంచి పంపారు'