తెలంగాణ శాసనసభ సమావేశాల(telangana assembly sessions 2021)ను వీలైనన్ని ఎక్కువ రోజులు జరపాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) నిర్ణయించింది. కరోనా అదుపులో ఉండటం వల్ల ఎక్కువ రోజులు జరపాలని సభ్యులు కోరారు. 8 పనిదినాల పాటు సమావేశాలు(telangana assembly sessions 2021) నిర్వహించాలని తెరాస ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదించింది. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. 12 అంశాలపై చర్చించాలని కోరిన సీఎల్బీ నేత భట్టివిక్రమార్క... అందుకు సంబంధించిన జాబితాను సంఘానికి అందజేశారు. చర్చించాల్సిన అంశాలపై అన్ని పక్షాల నుంచి జాబితా రావాలని సభాపతి తెలిపారు. జాబితా వచ్చాక పనిదినాలు నిర్ణయిద్దామని పేర్కొన్నారు. ప్రాథమికంగా మాత్రం సమావేశాలను అక్టోబర్ 5వరకు నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు.
ఎక్కువ రోజులు జరగాలి..
మరోవైపు.. ఎక్కువ రోజులు సభ నడపాలని కోరినట్లు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తెలిపారు. చాలా అంశాలపై చర్చ జరపాలని కోరినట్లు వెల్లడించారు. ప్రభుత్వం కొన్ని అంశాలపై చర్చ జరపాలనుకుంటోందని చెప్పిన భట్టి.. తాము అడిగినన్ని రోజులు సభ నడుపుతామన్నారని చెప్పారు.
ఎమ్మెల్యేల కోసం క్లబ్ నిర్మాణం
హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తరహాలో క్లబ్ నిర్మిస్తామని వివరించారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలన్నారు. అర్థవంతమైన, ముఖ్యమైన అంశమైతే సమయం ఇవ్వాలన్నారు. కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలని తెలిపారు. తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు సమయం కేటాయిస్తున్నామని కేసీఆర్ అన్నారు.
భాజపా ఎమ్మెల్యేల అసంతృప్తి...
బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఉపసభాపతి పద్మారావు, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. మరోవైపు... బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదని భాజపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.