కేంద్రం తెచ్చే కొత్త విద్యుత్ చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం తేవొద్దని భాజపా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య స్ఫూర్తిని అడ్డంగా నరికే చట్టమని విమర్శించారు. కేంద్ర ప్రతిపాదిత చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని శాసనసభలో కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
'కేంద్ర చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటర్లు పెట్టాలి. రాష్ట్రంలోని 26 లక్షల బోర్ల కొత్త మీటర్ల కోసం రూ.700 కోట్లు కావాలి. మీటర్ రీడింగ్ తీస్తారు.. ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తారు. ఒకప్పుడు బిల్లు కలెక్టర్‌ను చూస్తే రైతులు ఎంతో భయపడేవారు. మన రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త చట్టంలో రెన్యుబుల్ విద్యుత్ 20 శాతం ఉండాలని నిబంధన ఉంది. ఆ చట్టం ద్వారా రాష్ట్రాలు తప్పనిసరిగా విద్యుత్ కొనాలి. కొనకపోతే 50 పైసల నుంచి రూ.2 వరకు జరిమానా వేస్తారు.'
- కేసీఆర్
కేంద్ర విద్యుత్ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ రంగం ప్రభుత్వం వద్ద ఉంటే డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్కో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ సంస్థలు లేకుంటే వేల ఉద్యోగాలు పోతాయన్నారు. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారని వెల్లడించారు. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఈఆర్సీ నియామకాలు మనచేతిలో ఉండవని స్పష్టం చేశారు. తీర్మానం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
ఇదీ చదవండి: కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం: కేసీఆర్