రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 2, 647 వార్డులు, 325 డివిజన్లు ఉండగా... అత్యధిక స్థానాలు తెరాస కైవసం చేసుకుంది. 50కిపైగా డివిజన్లలో స్వతంత్రులు విజయం సాధించారు. అనూహ్యంగా భైంసా, జల్పల్లి మున్సిపల్ పీఠాలు మజ్లిస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం ఏడు మున్సిపల్ పీఠాలు మాత్రమే దక్కించుకుంది. ఆమన్‌గల్, తుక్కుగూడ పురపాలికలు భాజపా ఖాతాలో చేరాయి.
కాంగ్రెస్ ఆధిక్యంలోనూ పాగాకు యత్నం!
కాంగ్రెస్ ఒకే వార్డు ఆధిక్యంలో ఉన్న నల్గొండ జిల్లా హాలియా, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీల పైనా గులాబీ దళం కన్నేసింది. ఎక్స్-అఫీషియో ఓట్లతో వీటిని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెరాస స్పష్టమైన ఆధిక్యత చాటింది. ఈ జిల్లా పరిధిలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలను.. అధికార పార్టీ ఏకపక్షంగా గెలుచుకుంది. నిర్మల్ జిల్లా భైంసా మాత్రం ఎంఐఎం దక్కించుకుంది. ఖానాపూర్‌లో తెరాస, కాంగ్రెస్ సమాన స్థానాలు సాధించాయి.
భీమ్‌గల్ క్వీన్‌స్వీప్..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపాలిక ఫలితాల్లో తెరాస హవా కొనసాగింది. మొత్తం 6 మున్సిపాలిటీల్లో తెరాస ఆధిపత్యం ప్రదర్శించింది. బోధన్‌లో మొత్తం 38 స్థానాలకు.. 19 తెరాస గెలుపొందగా 11 ఎంఐఎం గెలుపొందింది. బోధన్‌లో అధికార పార్టీ, మజ్లిస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. కామారెడ్డిలో 49కి తెరాస 23, కాంగ్రెస్ 12 చోట్ల గెలుపొందింది. భీమ్‌గల్‌లో తెరాస ఏకపక్ష విజయం సాధించింది. 12కు 12 స్థానాలు కారు ఖాతాలో వేసుకొని క్లీన్‌స్వీప్ చేసింది.
స్వతంత్రుల హవా..
తెరాస కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. మరోసారి గులాబీ పరిమళించింది. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మరోసారి తెరాస జెండా ఎగిరింది. సిరిసిల్లలో 39 స్థానాలు ఉండగా... 22 స్థానాలు గెలిచి తెరాస పీఠం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 2, భాజపా 3 మూడు వార్డులతో సరిపెట్టుకోగా.. స్వతంత్రులు ఏకంగా 12 స్థానాల్లో విజయం ఢంగా మోగించారు. వేములవాడ పురపాలికలో 28 వార్డులు ఉండగా... 15 చోట్ల గెలిచి ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది.
ఓరుగల్లు కారుదే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెరాస విజయబావుటా ఎగరేసింది. 9 మునిసిపాలిటీల్లో మెజార్టీ వార్డులను గెల్చుకొని అధికారపార్టీ 8 ఛైర్మన్ పీఠాలను అవలీలగా కైవసం చేసుకుంది. మహబూబూబాద్ జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరుల్లో అధికార పార్టీ ఆధిక్యం కనబరిచింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్, వర్ధన్నపేట్, పరకాలల్లో తెరాస ప్రభంజనం సృష్టించింది. భూపాలపల్లిలలోనూ తెరాస స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. అయితే జనగాంలో మాత్రం కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. జనగాంలో 30 స్థానాలకు తెరాస 13, కాంగ్రెస్ 10, భాజపా 4, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు.
తెరాసదే పైచేయి...
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 పురపాలికలకు.. ఎక్స్-అఫిషియో సభ్యుల ఓట్లతో 3చోట్ల కలిపి మొత్తం 11 మునిసిపాలిటీల్లో గులాబీ పార్టీ ఛైర్పర్సన్ పీఠాల్ని దక్కించుకోనుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు మొత్తం ఐదు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో గులాబీ గుబాళింపు కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశం.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తెరాస ఆధిపత్యం కొనసాగింది. మొత్తం నాలుగు మున్సిపాలిటీలు. మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట్ కలిపి 75 వార్డులకు గానూ.. 45 వార్డులను కైవసం చేసుకుని తెరాస విజయ ఢంగా మోగించింది. కాంగ్రెస్, భాజపా ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోయాయి.
ధీటుగా రెబల్స్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ తెరాస అధిక స్థానాలు కైవసం చేసుకోగా... కొల్లాపూర్, అయిజలో తెరాస రెబల్ అభ్యర్థులే విజయం సాధించారు. ఫలితాల అనంతరం వారూ సొంతగూటికే చేరుకోనున్నందున... అవి కూడా గులాబీ పార్టీ ఖాతాలో పడనున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు గానూ తెరాస, కాంగ్రెస్ చెరో 4, భాజపా 2, ఎంఐఎం 1 గెలుచుకున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రానందున మణికొండలో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 6వార్డులు గెలుచుకున్న భాజపా కీలకంగా మారింది.
సర్కారు పనితీరే గెలిపించింది...
ఈ తరహా ఫలితాలు దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగనివని, తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు వరుసగా విజయాలు అందించటం తెరాస పాలనకు అద్దం పడుతోందన్నారు. కేంద్రం సహకరించకున్నా... పక్కా ప్రణాళికలు, పథకాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. తాను ప్రచారం చేయకున్నా.. అనూహ్య విజయం సాధించడం పట్ల తనయుడు కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. తెరాస శ్రేణులు అహంకారం పెంచుకోకుండా.. మరింత అంకిత భావంతో పని చేయాలన్నారు కేసీఆర్.
తెరాస విజయానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టిన ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన పని చూసే ప్రజలు తెరాసకు ఓటు వేశారని, తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెరాస డబ్బులు పంచి గెలిచింది...
అధికార తెరాస విపరీతంగా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలిచిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పార్టీ భాజపా మాత్రమేనని చెప్పారు.
ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ, బెదిరింపులకు పాల్పడి పురపోరులో తెరాస విజయం సాధించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మున్సిపాలిటీలు గెలవకుంటే.. పదవులు పీకేస్తానని బెదిరించి,.. విచ్చలవిడిగా డబ్బులు పంచి గెలుపొందారని ఆరోపించారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్‌కు ఓటరు అవగాహన అవార్డు!