- కొద్దిరోజుల క్రితం ఓ ప్రయాణికుడు రూ.500 వాలెట్ ద్వారా మెట్రో కార్డును రీఛార్జి చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత మెట్రోస్టేషన్‌కు వెళ్లి కార్డు చూపిస్తే పని చేయలేదు. స్టేషన్ సిబ్బందిని సంప్రదిస్తే బ్యాలెన్స్ లేదన్నారు. ఇప్పటివరకు ఆ రూ.500 వెనక్కి రాలేదు. వీటిపై తరచూ మెట్రోరైలు అధికారుల దృష్టికి ఫిర్యాదులు వెళుతున్నా సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు.
మెట్రోరైలు టిక్కెటింగ్‌లో సాంకేతిక సమస్యలు ప్రయాణికులను తికమక పెడుతున్నాయి. మెట్రో కార్డును ఆన్‌లైన్‌లో రీఛార్జి చేసుకున్న వారంతా తరచూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు. రీఛార్జి చేసినా కార్డులో నగదు జమ కాలేదని గుర్తించి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి ఇస్తున్నారు. లేకపోతే పేమెంట్ గేట్‌వే వద్దనే ఆగిపోతున్నాయి. డిజిటల్ చెల్లింపుల శకంలో ఎక్కువ మంది ఆన్‌లైన్‌కే మొగ్గు చూపుతున్నారు. మెట్రోరైలు కార్డు రీఛార్జి చేసుకునేందుకు మెట్రోరైలు యాప్ టీసవారీ, ఎల్‌అండ్‌టీ మెట్రో వెబ్‌సైట్, ఇతర వాలెట్లను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఈ తరహా చెల్లింపులన్నీ పేమెంట్ గేట్‌వేల ద్వారానే జరుగుతున్నాయి. రీఛార్జి చేయగానే వెంటనే కార్డులో, ఖాతాలో సదరు మొత్తం కన్పిస్తుంది. మెట్రో కార్డులో మాత్రం రీఛార్జి చేసిన రెండు గంటల తర్వాత స్టేషన్‌కు వెళ్లి కార్డును టిక్కెటింగ్ యంత్రాలపై చూపిస్తేనే అందులోకి జమ అవుతుంది. ఇక్కడే పలు సమస్యలు ఎదురవుతున్నాయి. రోజూ ప్రయాణించేవారికి వీటి గురించి అవగాహన ఉంటుంది కాబట్టి పర్లేదు. కానీ కొత్తగా ప్రయాణించేవారు, అడపాదడపా వెళ్లేవారికి సాంకేతికత సమస్యలు చికాకు పెడుతున్నాయి.
ఇటీవల మరో ప్రయాణికుడు కార్డును ఆన్‌లైన్ రీఛార్జి చేశారు. మెట్రోలో వెళ్లడం అతనికి కుదరలేదు. ఆ తర్వాత ఎప్పుడో గుర్తుకొచ్చి కార్డులో బ్యాలెన్స్ చూస్తే ఏమీ లేదని చూపించింది. రీఛార్జి మొత్తం ఏమైనట్లు అని కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే తమకు ఇంకా రాలేదని, రీఛార్జి వివరాలు ఇస్తే చూస్తామన్నారు. ఇందుకోసం రెండుసార్లు కాల్‌సెంటర్‌తో మాట్లాడాల్సి వచ్చిందని ప్రయాణికుడు వాపోయాడు. ఏదైనా సమస్య ఉంటే సొమ్ము అటు మెట్రోరైలు సంస్థకి వెళ్లక.. వెనక్కి రాక ఏమైనట్లో తెలియని దుస్థితి. పేమెంట్ గేట్‌వే ఖాతాల్లో ఉండిపోతున్నట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
1-2 గంటలు పడుతుంది..
ఈనెల 2న ప్రయాణికురాలు మెట్రో కార్డును రీఛార్జి చేస్తే సొమ్ము డెబిట్ అయినా మెట్రో కార్డులో మాత్రం పడలేదని ఎల్‌అండ్‌టీ మెట్రోకి ఫిర్యాదు చేశారు. అలా అవ్వడానికి 1-2 గంటల సమయం పడుతుందని తెలిపారు. దీనిపై స్టేషన్ ప్రవేశ మార్గాల్లోని టిక్కెట్ గేట్లపై చూపించగానే క్రెడిట్ అవుతాయని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. రీఛార్జిలో సమస్యలుంటే 040-23332555కు ఫోన్ చేయాలని సూచించారు.