TDP Leaders On Viveka Murder Case: వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐకి తెలుసని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వివేకా హత్య కేసులో తనను విచారించాలని వైకాపా నాయకులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తన ప్రమేయం లేనందునే విచారణకు పిలవలేదని అన్నారు. పూర్తి విషయాలు బహిర్గతమయ్యాక మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారని నిలదీశారు. వివేకా హత్య కేసును అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారిస్తోందని.. సీబీఐ విచారించాక కూడా ఆ నెపాన్ని తెదేపాకు ఆపాదించడమేంటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు చంద్రబాబుకు ఆపాదించటం సరికాదని హితవు పలికారు. వివేకాను హత్య చేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు.
"వివేకా హత్య కేసును దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. పూర్తి విషయాలు బహిర్గతమయ్యాక మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు. సీబీఐ విచారించాక కూడా ఆ నెపాన్ని తెదేపాకు ఆపాదించడమేంటి ?. సీబీఐకి వైఎస్ కుటుంబంపై ఏమైనా కక్ష ఉంటుందా ?. వివేకా హత్యను చంద్రబాబుకు చుట్టడం సరికాదు. వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐకి తెలుసు. నా ప్రమేయం లేనందున విచారణకు పిలవలేదు. హత్య చేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది." -బీటెక్ రవి, తెదేపా ఎమ్మెల్సీ
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో నిందితులెవరనేది త్వరలోనే తేలనుందనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడేళ్లుగా మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని అయోమయానికి గురి చేశారని ఆరోపించారు. అమరావతి రాజధానిపై వైకాపా ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపదెబ్బ వంటిందన్నారు.
జగన్ పేరు చేర్చాలి..
వివేకా హత్య నేరపూరిత కుట్ర అని ఇందులో సీఎం జగన్ ప్రధాన భాగస్వామి అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిందితుల జాబితాలో అవినాష్‌తో పాటు జగన్ పేరు కూడా చేర్చాలని అన్నారు. హత్య వెనుక ఎవరున్నారో వివేకా కుమార్తె, అల్లుడు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. వైకాపా నేతలకు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అర్థం తెలియదని దుయ్యబట్టారు. రాజధానిపై మరో చట్టం చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఎద్దేవా చేశారు.