శ్రీశైలం నిండకుండా.. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులతో పాటు రాయలసీమ ఎత్తిపోతల వల్ల ఏపీలోని ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆ జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతోందని..కరవు జిల్లా గొంతు కోయవద్దని ఎమ్మెల్యేల గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజినేయులు స్వామి, ఏలూరి సాంబశివరావు సీఎం రాసిన లేఖలో కోరారు. పంట భూములు, భూగర్భజలాలకు సాగర్ నీరే ఆధారమని లేఖలో పేర్కొన్నారు. 15 ఏళ్లలో మూడు సంవత్సరాలు మాత్రమే సాధారణ వర్షపాతం వస్తే.. ప్రకాశం జిల్లాలో మిగిలిన పన్నెండేళ్లు కరవే తాండవం చేసిందన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత చేటు చేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం నిండి నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తేనే ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు పారుతాయని గుర్తు చేశారు. శ్రీశైలం నిండకుండా మీరు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటని లేఖలో ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో కరవు జిల్లా పరిస్థితి ఏంటని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల పెంచాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. గుంటూరు ఛానల్‌ను దగ్గుబాడు వరకు పొడిగించి ప్రజల దాహార్తిని తీర్చే, పంటలకు సాగునీరు ఇవ్వాలని కోరారు.