ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటనను కొనసాగించనున్నారు. మొదటిరోజు గుడుపల్లె, కుప్పం మండల కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేసిన చంద్రబాబు.. ఉదయం జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తిరుపతి, చిత్తూరు తెదేపా పార్లమెంటరీ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. పురపాలక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నాయకులతో చర్చించారు.
అధికారులు ఎందుకు రెచ్చిపోతున్నారు..
చంద్రబాబు పర్యటనపై కక్ష సాధించేందుకే.. కుప్పం ఆర్అండ్బీ అతిథి గృహానికి విద్యుత్ సౌకర్యం నిలిపివేశారని మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. ఉదయం నుంచి కుప్పం ఆర్అండ్బీ అతిథి గృహానికి విద్యుత్ నిలిపి వేయడం దారుణమన్నారు. కనీసం జనరేటర్ అందుబాటులో లేకుండా చేశారని అన్నారు. కాన్వాయ్ కారు బ్యాటరీలతో జనరేటర్ నడుపుతున్నామన్నారు. అధికార పార్టీ నాయకులు సరే.. అధికారులు ఎందుకు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వకపోవటం దారుణమని అన్నారు. వాపును చూసి వైకాపా నాయకులు బలం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మరికాసేపట్లో రామకుప్పం మండలం పర్యటనకు బయలుదేరనున్న చంద్రబాబు.. మధ్యాహ్నం శాంతిపురం మండలంలో పర్యటించనున్నారు. రెండు చోట్లా పార్టీ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించనున్నారు. శాంతిపురంలో పార్టీ నేత మధు నివాసానికి వెళ్లి అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఆర్అండ్ బీ అతిథి గృహానికి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారి నుంచి చంద్రబాబు వినతిపత్రాలను స్వీకరించనున్నారు.
ఇదీ చూడండి. వాకిలే పాఠశాల.. రూపాయికే చదువు!