ఏపీలో ఏడాదిన్నర కాలంగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పరాకాష్ఠగా రామతీర్థంలోని ఘటన కనిపిస్తోందన్నారు. శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టి శిరస్సు భాగాన్ని తీసుకెళ్లడం పిచ్చివాళ్ల చర్య కాదని.. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాద చర్య అని మండిపడ్డారు.
పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. అందువల్లే చారిత్రక ఆలయంలో దుర్మార్గపు చర్యకు తెగబడ్డారన్నారు. ఇప్పటి వరకూ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం వెనక ఉన్నవారిని, ఆ నేరానికి పాల్పడ్డవారిని పట్టుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేశారు.
రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతున్న ఈ తరుణంలో ఏపీలో మాత్రం రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆయనకు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలని హితవు పలికారు.
హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు. అన్యమత పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రికి పవిత్ర తిరుమల క్షేత్రం నుంచి మంత్రులు శుభాకాంక్షలు చెప్పడం దురదృష్టకరమన్నారు. శ్రీవారి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు.
అన్యమత సంబంధ విషయాలు ప్రస్తావించకూడదనే నియమాలను కావాలనే అధికార పార్టీ నాయకులు విస్మరిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏడాదిన్నరగా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వరుస సంఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్.. మరింత మెరుగుపడ్డాం: డీజీపీ