Stalin about Statue Of Equality: దేశ సమగ్రత, ప్రగతి శీల అభివృద్ధికి సమతామూర్తి విగ్రహం అవసరమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రామానుజాచార్యులు ఆచరించిన సమానత్వం దేశవ్యాప్తంగా వ్యాపించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా... 216 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు స్టాలిన్ ధన్యవాదాలు తెలియజేశారు.
సమానత్వం కోసం తమ నాయకుడు, తమిళనాడు మాజీ సీఎం ఎం కరుణానిధి అవిశ్రాంతంగా పోరాడారని స్టాలిన్ గుర్తు చేశారు. డీఎంకే నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. సమతామూర్తి రామానుజాచార్యుల జీవిత చరిత్రను టెలీ సీరియల్ రూపంలో కరుణానిధి రచించారని... ఆయన రచనల్లో ఇదే చివరిదని చెప్పారు. మహానుభావుడి జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి... ఇది చాలా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఆ రచనలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని అన్నారు.
కళైంగర్ అడుగుజాడల్లో నడుస్తూ.. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోంది. రామానుజ తీసుకొచ్చిన సామాజిక సంస్కరణలు ఆచరణయోగ్యంగా ఉన్నాయి. ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా.. తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని దేవాలయాల్లో అర్చకులుగా నియమిస్తోంది. రాష్ట్రంలోని ఆలయాలను క్రమబద్ధీకరించడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. దేవాలయాల నిర్వహణ కోసం అవసరమైన నిధులను సమర్థంగా కేటాయిస్తోంది. పూజారుల సంక్షేమం కోసం పని చేస్తోంది. పూజారులు, భక్తులకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాం. అందుకే తమిళనాడు అత్యుత్తమ ఆలయ నిర్వహణ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది.
-స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు, రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగాలని స్టాలిన్ కోరుకున్నారు. సమతామూర్తి విగ్రహం దేశ సమైక్యతకు చిహ్నంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: Statue Of Equality : సమతా మూర్తి నిర్మాణం సాకారమైంది ఇలా..