రెండో దశలో కొవిడ్ రాష్ట్రంపై తన పంజా విసురుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వేలాది ఆస్పత్రిల్లో సాధారణ శస్త్ర చికిత్సలను యాజమాన్యాలు నిలిపివేశాయి. రోగులు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈఎన్‌టీ విభాగాలకు చెందిన పలు చిన్న ఆస్పత్రులను మూసివేస్తున్నారు. పది రోజులుగా రాజధానిలో దాదాపు 70 వేల వరకు చిన్నా పెద్దా ఆపరేషన్లు నిలిచిపోయాయి. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్పనిసరి అయితేనే ఆపరేషన్లు చేస్తున్నారు.
మెల్లమెల్లగా కొవిడ్ కేంద్రాలుగా..
సికింద్రాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో 900 పడకలున్నాయి. 400 పడకలను ఇప్పటికే కొవిడ్‌కు కేటాయించారు. మిగిలిన 500 పడకలపై ఉన్న రోగులను క్రమేపీ ఇళ్లకు పంపించి వాటిని కరోనా రోగుల కోసం కేటాయించనున్నట్లు చెబుతున్నారు. ప్రముఖ ఆస్పత్రుల్లో కూడా సాధారణ చికిత్సలను నిల్పివేశారు. గుండెపోటు, ఇతరత్రా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడిన రోగులను మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే గాంధీలో సాధారణ వైద్యాన్ని బంద్ చేశారు. కింగ్‌కోఠి, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రులనూ కరోనా ఆస్పత్రులుగా మార్చడానికి సర్కారు యత్నిస్తోంది. దీన్నిబట్టి చూస్తే వచ్చే వారం రోజుల నాటికి అత్యవసర వైద్యం తప్పితే సాధారణ వైద్యం నిలిచిపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పుడొద్దు తర్వాత వస్తాం..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 పడకలు ఆపైన ఉన్న ఆస్పత్రుల సంఖ్య 4వేల పైమాటే. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని అన్ని విభాగాల్లో ప్రతిరోజూ చిన్నా పెద్దా శస్త్రచికిత్సలు 5వేల నుంచి పదివేల వరకు జరుగుతుంటాయి. గత ఏడాది మార్చి నెలలో కరోనా తొలిదశ వైద్యం రంగంపై తీవ్రమైన ప్రభావం చూపించింది. గాంధీ, ఉస్మానియాతోపాటు అన్ని ఆస్పత్రులు 80 శాతం మేర కొవిడ్ వైద్యం మాత్రమే అందించాయి. అప్పట్లో రెండు నెలలపాటు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్రధానంగా డెంటల్, కళ్లు, ముక్కు చెవి ఆస్పత్రులపై తీవ్ర ప్రభావం పడింది. పంటికి సంబంధించి రూట్ కెనాల్.. ఇతరత్రా చికిత్స చేయాలంటే మూడు నాలుగుసార్లు దశలవారీగా చేస్తుంటారు. ఇలా ఒకసారి పంటి చికిత్స చేయించుకున్న వారికి రెండోసారి (సెకండ్ సిట్టింగ్) కోసం తేదీ ఇచ్చినా.. ఇప్పుడు వద్దులెండి...తరువాత వస్తామని రోగులు చెబుతున్నారని వైద్యవర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్‌లో పేరొందిన ఆస్పత్రిలోని డెంటల్ విభాగానికి ప్రతిరోజూ వందమంది వరకు రోగులు వచ్చేవారు. గత మూడు రోజులుగా పది మంది కూడా రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ విభాగానికి రెండోసారి చికిత్స చేయించుకోవడానికి రావాల్సిన దాదాపు 500 మంది వైద్యాన్ని వాయిదా వేసుకున్నారని వైద్యులు తెలిపారు.
అపోహతోనే రోగులు రావడం లేదు
కరోనా వల్ల దాదాపు పంటి వైద్యం నిలిచిపోయింది. ఈఎన్‌టీ, కంటి వైద్యంపైనా ప్రభావం పడింది. పంటి వైద్యానికి సంబంధించి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన రోగులు ఆస్పత్రులకు రావడం లేదు. గత 20 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. పంటి వైద్యం వల్ల కరోనా వస్తుందన్న అపోహతో కొన్ని సున్నితమైన ఆపరేషన్లు చేయించుకోకపోతే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మేం అనేక జాగ్రత్తలు తీసుకున్నా రోగులు రాకపోవడంతో ఆ విభాగాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి.
- డాక్టర్ మేకా ప్రసాద్, కిమ్స్ డెంటల్ విభాగం ఇన్‌ఛార్జి
- ఇదీ చదవండి : వచ్చే నాలుగైదు రోజుల్లో విషమ పరిస్థితులు