నిర్మాణాలను కూల్చివేసే ముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలుచేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా.. నోటీసులు ఇచ్చిన వారి వివరణ తీసుకోకుండా కూల్చివేసిన అధికారులపై చర్యలు చేపట్టాలంది. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత అధికారులకు పంపాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్ హబ్సిగూడ పరిధి వివేకానందనగర్‌లో షెడ్ కూల్చివేతపై పి.నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.బుచ్చిరెడ్డి వాదనలు వినిపించారు. మార్చి 25న నోటీసులు జారీచేసి 26న నిర్మాణాన్ని కూల్చివేశారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది సంపత్ ప్రభాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2021 నుంచి నోటీసులు ఇస్తున్నామని, సెప్టెంబరులో చివరిగా కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వివరణ ఇస్తూ సాయంత్రం నోటీసులను ఎవరూ తీసుకోకపోవడంతో గోడకు అంటించామని, ఉదయం కూల్చివేశామని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి జీహెచ్‌ఎంసీ అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ దశలో జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. జీహెచ్‌ఎంసీ అధికారి నిజాయితీతో విధులు నిర్వహిస్తుంటారని, మొదటి తప్పుగా భావించి ఉదారంగా వ్యవహరించాలని అభ్యర్థించగా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.ఈ కేసులో పిటిషనర్లు నష్టపరిహారం కావాలనుకుంటే సంబంధిత వ్యవస్థను ఆశ్రయించవచ్చంటూ పిటిషన్‌లపై విచారణను ముగించారు.
కరూర్ వైశ్యా బ్యాంకు - మేఘా ఇంజినీరింగ్ వివాదాన్ని పరిష్కరించండి
కరూర్ వైశ్యా బ్యాంకు తమకు వ్యతిరేకంగా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయకుండా నియంత్రించాలంటూ మేఘా ఇంజినీరింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను రెండు వారాల్లో తేల్చాలని హైదరాబాద్ వాణిజ్య కోర్టుకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రూ.33.75 కోట్ల రుణానికి సంబంధించి ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయకుండా నియంత్రిస్తూ వాణిజ్య కోర్టు ఇచ్చిన ఆదేశాలను వైశ్యా బ్యాంకు హైకోర్టులో సవాల్ చేసింది. బ్యాంకు తరఫున సీనియర్ న్యాయవాది డి.శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ గతేడాది సెప్టెంబరు వరకు మేఘా ఇంజినీరింగ్ వాయిదాలు చెల్లిస్తూ వచ్చిందని, అనంతరం నిలిపివేసిందన్నారు. మేఘా తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బ్యాంకు నుంచి తాము ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదన్నారు. శ్రేయీ ఇన్‌ఫ్రాకి తమకు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా బ్యాంకు వాయిదాలు చెల్లించామని చెప్పారు. ఆ సంస్థ యంత్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో చెల్లింపులు నిలిపివేశామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కింది కోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరిస్తూ, పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై రెండు వారాల్లో నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది.
ఇవీ చూడండి: