Sundar Naidu: ప్రముఖ పారిశ్రామికవేత్త, పౌల్ట్రీ దిగ్గజం డాక్టర్ సుందరనాయుడు భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలోని ఆయన స్వగృహనికి పార్థివదేహన్ని తరలించారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు, రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుందరనాయుడు గొప్ప మానవతావాదని, రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని బరువెక్కిన హృదయాలతో నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి పార్థివదేహన్ని తరలించే క్రమంలో దారి మధ్యలో పూతలపట్టు, రంగంపేట కూడలి వద్ద రైతులు నివాళులర్పించారు. బాణాసంచా పేల్చి సుందరనాయుడు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు గాంధీ కూడలిలో స్థానికులు భౌతికకాయం తరలిస్తున్న వాహనం వద్దకు చేరుకుని అశ్రు నివాళులర్పించారు.
రెడ్డిగుంటలోని స్వగృహంలో సుందరనాయుడు భౌతికదేహనికి చిత్తూరు జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన రైతులు నివాళులర్పించారు. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల సుందరనాయుడు పార్థివదేహనికి శ్రద్ధాంజలి ఘటించారు, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌తో పాటు పలువురు తెలుగుదేశం నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఈనాడు ఎండీ కిరణ్, సుందరనాయుడు కుమార్తె, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.
సుందరనాయుడు భౌతికదేహానికి నివాళులర్పించిన కోళ్ల రైతులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరవుకు నిలయమైన రాయలసీమలో రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కల్పించేందుకు కోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సహించారన్నారు. ఈ రంగంలో విశేష సేవలందించిన ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సందర్శనార్ధం సుందరనాయుడు భౌతిక దేహన్ని రెడ్డిగుంటలోని ఆయన స్వగృహంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచనున్నారు. మూడు గంటలకు బాలాజీ హేచరీస్ ఆవరణలో నిర్వహించే అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'నాన్నగారు వేలాది రైతుల హృదయాల్లో స్థానం సంపాదించారు'
Sundara Naidu Passed Away: బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు కన్నుమూత