వచ్చే పదేళ్లలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి అన్నారు. 2020-21 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన '2030 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా భారత్' అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ప్రసంగించారు.
స్వాతంత్రం నాటి నుంచి 1990 వరకు భారత్ అంతగా అభివృద్ధి చెందలేదని సుబ్రమణ్య స్వామి తెలిపారు. ఈ సమయంలో ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధించిందన్నారు. దీనికి కారణం జవహర్‌లాల్ నెహ్రూనే అని ఆరోపించారు. నెహ్రూ సోవియట్ ఆర్థిక విధానాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తిరిగి పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఆ సమయంలో ఏడాదికి 8 శాతం జీడీపీ వృద్ధి సాధించిందన్నారు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కూడా దాన్ని కొనసాగించారన్నారు. ఇక అప్పటి నుంచి వృద్ధి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని కొనియాడారు.
నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందని పేర్కొన్నారు. ఏడాదికి 10శాతం వృద్ధితో వచ్చే పదేళ్లలో భారత్ చైనాను కూడా అధిగమిస్తుందన్నారు. ఇదేవిధంగా వృద్ధి సాధిస్తూ పోతే.. భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి చేరుతుందన్నారు.
ఇవీ చూడండి: 'మంత్రి కోర్టుకు వస్తారా?.. వివరణ ఇస్తారా?