రాష్ట్రంలోని గురుకులా(Telangana gurukula schools)ల్లో సీట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కరోనాతో పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడం, ప్రైవేటులో ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో అక్కడ మాన్పించేసి గురుకులాలకు పంపిస్తున్నారు. ఒక్కసారి ఐదో తరగతిలో సీటు సంపాదిస్తే పీజీ వరకు తమ పిల్లల చదువుకు తిరుగుండదన్న ఆశతో చేర్పిస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్‌లో 93.55 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగతా సీట్లనూ భర్తీ చేయాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి.
రెండు విడతల్లో 45,304 సీట్ల భర్తీ..
రాష్ట్రవ్యాప్తంగా(Telangana gurukula schools admission) 604 ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 48,320 సీట్ల భర్తీకి ఆగస్టులో ఎస్సీ గురుకుల సొసైటీ ప్రవేశపరీక్ష నిర్వహించింది. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తోంది. ఇప్పటి వరకు కౌన్సెలింగ్ ద్వారా 45,304 ఐదో తరగతి సీట్లను భర్తీ చేసినట్లు సొసైటీ వర్గాలు వెల్లడించాయి. సీట్లు ఆశిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది కరోనాతో పాఠశాలలు మూతపడటం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో చాలా మంది చదువుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో సీటు కోసం తమ పిల్లల్ని మరోసారి ఐదో తరగతిలో చేర్పించేందుకు సైతం తల్లిదండ్రులు వెనకాడటం లేదు. ఈ కేటగిరీ విద్యార్థులు దాదాపు 10 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం.
86 శాతానికి చేరిన హాజరు..
గురుకులాల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరు క్రమంగా పెరుగుతోంది. అన్ని గురుకులాల్లో కలిపి సగటున 86 శాతం హాజరు నమోదవుతున్నట్లు సొసైటీ వర్గాలు వెల్లడించాయి. టీచర్లు, ప్రిన్సిపాళ్లకు హాజరు బాధ్యతలు అప్పగించడంతో వారు తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను పాఠశాలలకు రప్పిస్తున్నారు.
కరోనా కారణంగా గతేడాది విద్యాసంవత్సరం నుంచి మూతపడిన గురుకులాలు(Telangana Gurukuls).. గతేడాది 22నుంచి తెరుచుకోనున్నాయి. అన్ని గురుకులాలు, కస్తూర్బా, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు ప్రారంభించాయి. దీంతో పాఠశాలలు, వసతి గృహాలు, భోజనాల గదులు శానిటైజ్ చేశారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అనారోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సూచించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు కొవిడ్ టీకాలు తీసుకోవాలని, టీకాలు తీసుకున్నవారే బోధన చేయాలని సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
ఇదీ చదవండి: Revanth on KCR : 'అమరవీరుల కుటుంబాలను ఆదుకోని కేసీఆర్... పంజాబ్ రైతులను ఆదుకుంటారంటే నమ్మాలా?'