‘‘ఇంటర్ పూర్తయిందా.. తర్వాతేంటి?’’- దీనికి సమాధానం చెప్పకముందే ‘‘ఇంజినీరింగా? మెడికలా?’’ అని మరో ప్రశ్న వెంటనే వస్తుంది. విద్యార్థి తన అభిమతాన్ని వెల్లడించేలోపే.. ‘‘వేరే ఇంకేముంది? ఇంజినీరింగ్ లేదా మెడికల్’’ అని తల్లిదండ్రులు ఠకీమని చెప్పేస్తారు. గత కొన్నేళ్లుగా చదువంటే కేవలం బీటెక్, ఎంబీబీఎస్ అన్నట్టు పరిస్థితి మారిపోయినా.. విభిన్న కోర్సులు ఎంచుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. కొత్త కెరీర్ల వైపు వారు అడుగులు వేస్తున్నారు. ఆ కోర్సుల్లో సీట్లు తక్కువ, పోటీ ఎక్కువ ఉండటంతో ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)లో ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు హోటల్ మేనేజ్‌మెంట్, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్‌ఎల్‌బీ చదివినవారికి కార్పొరేట్ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలిస్తున్నాయి. వీరితో పాటు హోటల్ మేనేజ్‌మెంట్ చేసినవారూ విదేశీ బాటలో పయనిస్తున్నారు. అఖిలభారత సాంకేతిక విద్యామండలి 2020-21 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 12.86 లక్షల బీటెక్ సీట్లుండగా.. 7.09 లక్షలు భర్తీ అయ్యాయి. ఆ సంవత్సరం బీటెక్ పూర్తి చేసుకున్నవారిలో 3.28 లక్షల మంది మాత్రమే కొలువులు సాధించారు. ఈ నేపథ్యంలో విభిన్న రంగాల్లో స్థిరపడేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇవీ భవిష్యత్తు అవకాశాలు..
* భారత్‌లో 2022 నాటికి మల్టీమీడియా డిగ్రీ చేసిన విద్యార్థులు 13 లక్షల మంది అవసరమని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ అధ్యయనం వెల్లడించింది. కానీ, ఏటా 30 వేల మందికి మించి రావడం లేదు.
* వచ్చే అయిదేళ్లలో భారత్‌లో ఈ-కామర్స్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అమెజాన్ సంస్థ రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి వాటికి ఏటా డిమాండ్ పెరుగుతున్నా అండర్‌గ్రాడ్యుయేట్‌లో ఈ-కామర్స్ కోర్సులను అందించే విద్యాసంస్థలు రెండు మాత్రమే ఉండటం గమనార్హం.
* ‘స్టాటిస్టీషియన్ల అవసరం ప్రపంచవ్యాప్తంగా 2019-29 మధ్య ఏటా 35 శాతం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో వందల సంఖ్యలోనే తయారు చేసుకుంటున్నాం’ అని సీఆర్ రావు అడ్వాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ యు.యుగంధర్ తెలిపారు.
కేంద్రీయ విద్యాసంస్థలపైనే గురి..
కొత్త కోర్సుల్లో చేరుతున్నవారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలనే ఎంచుకుంటున్నారు. వాటిలో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రాంగణ నియామకాలకూ కొరత ఉండదని భావిస్తున్నారు. సీట్లు తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండటంతో శిక్షణ తీసుకొని మరీ ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ఫ్యాషన్ టెక్నాలజీ, డిజైన్, లా, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులకు డిమాండ్ పెరుగుతుండటంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా శిక్షణ సంస్థలు ఏర్పాటయ్యాయి.
ఇంటర్ తర్వాత చదవదగ్గ ముఖ్యమైన కోర్సులు..
1.ఈ-కామర్స్/డిజిటల్ మార్కెటింగ్, 2.హోటల్ మేనేజ్‌మెంట్, 3.యానిమేషన్/మల్టీమీడియా, 4.ఫ్యాషన్ డిజైనింగ్/ఇంటీరియర్ డిజైనింగ్ తదితరాలు, 5.ఈవెంట్ మేనేజ్‌మెంట్, 6.స్టాటిస్టిక్స్, 7.మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, 8.బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, 9.ఇన్సూరెన్స్, 10.ఎడ్యుకేషన్ టెక్నాలజీ, 11.లా, 12.ఫైన్ ఆర్ట్స్/ఆర్కిటెక్చర్
కొన్ని కోర్సుల్లో పోటీ ఇలా..
* కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 17 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)లలో బ్యాచులర్ ఆఫ్ డిజైన్, బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తదితర కోర్సులపై యువత ఆసక్తి చూపుతోంది. వీటిలో 5,023 సీట్లకు 35 వేల మంది వరకు పోటీపడుతున్నారు.
* దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో సీట్ల భర్తీకి ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్) నిర్వహిస్తారు. ఈసారి ఈ నెల 19న జరగనుంది. ఈ పరీక్షను 2018లో 59 వేల మంది, 2019లో 60 వేల మంది, 2021లో 62,107 మంది రాశారు. ఇంటర్ విద్యార్హతతో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లు 2,622 ఉండగా.. వాటికీ తీవ్ర పోటీ నెలకొంది.
* దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే హోటల్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో బీఎస్‌సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) సీట్ల భర్తీకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ జేఈఈ(ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు 2021లో 32,603 మంది దరఖాస్తు చేశారు.
* దేశంలో 19 ఐఐఎంలు ఉండగా.. ఇండోర్, రోహతక్‌లలో ఇంటర్ విద్యార్హతతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం) కోర్సు అందిస్తున్నారు. 280 సీట్లకు ఏటా వేల మంది పోటీ పడుతున్నారు. ఐఐఎం ఇండోర్‌లో 120 సీట్లుండగా 2019లో 17,550 మంది పరీక్ష రాశారు. 2014లో ఆ సీట్లకు 12,166 మందే పోటీపడ్డారు.
* కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో కేవలం మూడు- అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(నిడ్) ప్రాంగణాలున్నాయి. వీటిలో 458 బ్యాచులర్ ఆఫ్ డిజైన్(బీడెస్) సీట్లు ఉండగా.. గత ఏడాది దాదాపు 8 వేల మంది పోటీపడ్డారు.
ప్రముఖ విద్యాసంస్థల్లోనే నాణ్యమైన విద్య..
ఇటీవలి కాలంలో బీఏ లిబరల్ ఆర్ట్స్, సైకాలజీ, ఆర్థికశాస్త్రం, న్యాయవిద్య తదితర కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ విద్యాసంస్థల్లో చేరితేనే.. వినూత్న కోర్సుల్లో నాణ్యమైన విద్య అందుతుంది.
- ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, కెరీర్ కౌన్సెలర్
విద్యార్థుల ఆసక్తిని బట్టి నిర్ణయించాలి..
'విద్యార్థులు ఏ కోర్సు చదవాలన్నది 99 శాతం తల్లిదండ్రులే నిర్ణయిస్తున్నారు. పిల్లల ఆసక్తిని గౌరవిస్తే ఇంజినీరింగ్ లాంటి కోర్సుల్లో ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోతుంది. బీటెక్ తొలి ఏడాది తర్వాత మిగిలిన ఫీజు తీసుకోకుండా సర్టిఫికెట్లు ఇస్తామంటే కనీసం 5 శాతం మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లోలా ఏ విద్యార్థి ఏ రంగంలో రాణించగలుగుతారో గుర్తించేలా సైకోమెట్రిక్ పరీక్షలు జరపాలి.'-ఎస్.వి.సత్యనారాయణ, ఓయూ కామర్స్ విభాగం విశ్రాంత ఆచార్యుడు
ఇవీ చదవండి: