Effect of Holidays on Children's Behavior : కరోనా మహమ్మారి మరోసారి చదువులను దెబ్బతీసింది. ఒమిక్రాన్ ప్రభావంతో ఈ నెల 30 వరకు విద్యాసంస్థలను మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఆన్‌లైన్ బోధన ప్రారంభించారు. రెండేళ్లుగా పాఠశాలలు సరిగా నడవక పిల్లలు మానసిక, శారీరక రుగ్మతలకు గురయ్యారు. విపరీత ధోరణులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ బడులు బంద్ కావడంతో సామాజిక సంబంధాలకు దూరమవుతున్నారు. ప్రత్యక్ష బోధనకు ఆన్‌లైన్ చదువు ప్రత్యామ్నాయం కాదని విద్యావేత్తలు చెబుతున్నారు. గత సెప్టెంబరులో విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాక పరిస్థితులు కుదురుకుంటున్నాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. విపరీత ధోరణుల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని, మళ్లీ బడులు మూసేయడంతో ప్రవర్తన, పద్ధతుల్లో పాత ధోరణి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
తలెత్తే సమస్యలు
- Effect of Schools Closure on Children : పాఠశాల ఉంటే ఉదయం లేవడం నుంచి రాత్రి నిద్రించడం వరకు అన్ని సమయానుసారం జరిగిపోతుంటాయి. పాఠశాలలు లేకపోవడంతో పిల్లల దైనందిన కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.
- ఇంటికే పరిమితం కావడం, ఆన్‌లైన్ తరగతుల వల్ల సరిగా కూర్చోకపోవడం వంటివి తలెత్తుతాయి. వెన్నెముక, మెడ, కళ్లపై ప్రభావం పడుతుంది.
- ఫౌండేషన్ నైపుణ్యాలు.. చదవడం, రాయడం, నేర్చుకోవడం, ఏకాగ్రత వంటివి కొరవడతాయి.
- చేతిరాత లయ తప్పుతుంది.
- ఏదైనా విషయంపై శ్రద్ధ పెట్టడం తగ్గిపోతుంది.
- వ్యక్తిగత శుభ్రత దెబ్బ తింటుంది.
- సమయ పాలన గాడి తప్పుతుంది.
- బద్ధకం పెరిగిపోయే అవకాశం ఉంది.
ఇల్లు రెండో పాఠశాల కావాలి
- Effect of Schools Closure on Students : ఇళ్లలో తల్లిదండ్రులే టీచర్లుగా మారి ఓపికతో అన్నీ నేర్పించాలి. ఇల్లు రెండో పాఠశాల కావాలి.
- పిల్లలు చదువుకొనేలా సౌకర్యవంతమైన టేబుల్, కుర్చీ వంటివి అమర్చాలి.
- పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. కిడ్స్ లైబ్రరీ తరహా అల్మారా ఏర్పాటు చేయాలి.
- దైనందిన కార్యకలాపాలకు సమయసారిణి నిర్దేశించాలి.
- చేతిరాత పెంచేందుకు సొంత కథలు రాయించాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత పెంచేలా ‘సైకో ఎడ్యుకేషన్’ బోధించాలి. శుభ్రత పాటించకపోతే జరిగే అనర్థాలు అర్థమయ్యేలా తెలియజెప్పాలి.
- ఏకాగ్రత పెంచేందుకు మైండ్‌పుల్‌నెస్ టెక్నిక్స్ నేర్పించాలి. అవసరమైతే నిపుణులు, సైకాలజిస్టుల వద్ద తల్లిదండ్రులు సైతం చిన్నపాటి శిక్షణ తీసుకుంటే ఎంతో మేలు.
సమయ పాలన పాటించేలా చూడాలి
Effect of Corona Holidays on Students : పాఠశాల అనేది క్రమశిక్షణ నేర్పే వేదిక. స్నేహితులతో పిల్లలు తమలోని భావోద్వేగాలు పంచుకుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేక దైనందిన కార్యకలాపాలు దెబ్బతింటాయి. ఫలితంగా ప్రవర్తన, ఆలోచన, క్రమశిక్షణపై ప్రభావం పడుతుంది. కుంటిసాకులు అలవడతాయి. ప్రమాదకర ఆలోచనలు, ఏకాగ్రతను దెబ్బతిసే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎప్పుడుపడితే అప్పుడు తినడంతో బరువు పెరుగుతారు. కోపం, మొండితనం వస్తుంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు.. పిల్లలు సమయ పాలన పాటించేలా చూడాలి.
ప్రాథమికాంశాలు నేర్పించాలి
గతంలో పాఠశాలలు బంద్ అయినప్పుడు పిల్లల్లో అభ్యసన నైపుణ్యాలు బాగా దెబ్బతిన్నాయి. ఏయే అంశాలపై దృష్టి సారించాలో చెప్పాం. ప్రస్తుతం అన్ని స్కూళ్లలో పిల్లలతో వాట్సప్ గ్రూపులున్నాయి. అభ్యసన నైపుణ్యాలు పెంచేందుకు, ప్రాథమికాంశాలు నేర్పించేందుకు గ్రూపులను సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల కొంతమేర గ్యాప్ తగ్గుతుంది. ద్విభాష పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని విద్యార్థులతో చదివించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!