రాష్ట్రవ్యాప్తంగా బ్యాక్‌లాగ్‌లతో సతమతమవుతున్న విద్యార్థుల సంఖ్య సగటున 42.50 శాతంగా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులుండే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారి శాతం 62 శాతం ఉండగా... తెలంగాణ విశ్వవిద్యాలయంలో అది 67 శాతం ఉంది. కేవలం ఓయూలో సంప్రదాయ డిగ్రీలైన బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ కోర్సులనే పరిగణనలోకి తీసుకుంటే బ్యాక్‌లాగ్‌లున్న వారి శాతం 68 శాతం దాటడం గమనార్హం.
అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) స్థాయి కోర్సుల చివరి సెమిస్టర్ (సంప్రదాయ డిగ్రీకి ఆరో సెమిస్టర్, బీటెక్, బీఫార్మసీకి ఎనిమిదోది) పరీక్షలను సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని విశ్వవిద్యాలయాలు సన్నాహాలు ప్రారంభించాయి. చివరి సెమిస్టర్ సబ్జెక్టులను మాత్రమే సెప్టెంబరులో పరీక్షలు నిర్వహిస్తారు. బ్యాక్‌లాగ్‌లు సబ్జెక్టులతో పాటు పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు అక్టోబరులో జరపాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. అంటే చివరి సెమిస్టర్ పాసైనా బ్యాక్‌లాగ్ పరీక్షల కోసం ఎదురుచూడాల్సిందే. సాధారణంగా అయితే చివరి సెమిస్టర్‌తో పాటు బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల పరీక్షలు కూడా ఏటా ఏప్రిల్/మే నెలల్లో జరిపేవారు. ఈసారి కరోనా కారణంగా సెప్టెంబరులో కేవలం చివరి సెమిస్టర్ సబ్జెక్టులకే పరీక్షలు జరపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రాష్ట్రంలో యూజీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో వృత్తి విద్యా కోర్సులు కావడం, ప్రాంగణ నియామకాలకు ఎంపికై ఉంటారని ఎంబీఏ విద్యార్థులకూ సెప్టెంబరులో పరీక్షలు పూర్తి చేయనున్నారు.
నెల రోజులపాటు బ్యాక్‌లాగ్ పరీక్షలు
చివరి సెమిస్టర్ పరీక్షలు కేవలం 12- 15 రోజుల్లో పూర్తవుతాయి. బ్యాక్‌లాగ్‌లంటే 1-5 సెమిస్టర్లలో పరీక్షలుంటాయి. వాటిని పూర్తి చేయడానికి 25-30 రోజుల వరకు పడుతుందని ఓయూ అధికారులు చెలిపారు. ఒక సెమిస్టర్‌లో ఒక్క విద్యార్థి ఉన్నా పరీక్ష నిర్వహించాల్సిందేనని చెబుతున్నారు. అక్టోబరు మొత్తం బ్యాక్‌లాగ్ పరీక్షలకే పోతుంది. అన్ని సెమిస్టర్ల ఫలితాలు వస్తేనే విద్యార్థులు పాసయ్యారా? లేదా? అన్నది తేలుతుంది. అప్పటివరకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకూ సమస్యే అవుతుందని ఆచార్యులు చెబుతున్నారు.
యూజీసీ నుంచి స్పష్టత తీసుకుంటాం
-తుమ్మల పాపిరెడ్డి, ఛైర్మన్, ఉన్నత విద్యామండలి
తమిళనాడులో బ్యాక్‌లాగ్( సబ్జెక్టులకు కనీస మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేశారు. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే యూజీసీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది స్పష్టత తీసుకుంటాం. దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాం. ఒకవేళ అక్టోబరులో పరీక్షలు జరపాల్సి వస్తే పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.