ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. ప్రజా సర్వీసుల్లోని వారు సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని పేర్కొంది. సమ్మె నేపథ్యంలో హైకోర్టులో ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు.
"కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరేందుకు ముందుకొచ్చినా.. వారి కొనసాగింపు పై నిర్ణయం తీసుకోవడం ఆర్టీసీ యాజమాన్యానికి కష్టమే..! రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా తగిన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ కోరారు"
ఐకాసకు ఓపిక లేదు.. ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా..?
పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదని, చట్టం ప్రకారం సమ్మె ప్రారంభించడమే చట్ట విరుద్ధమని సునీల్ శర్మ తెలిపారు. యూనియన్ నేతలు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. చర్చల ద్వారా పరిష్కరించేందుకు కార్మిక శాఖ మధ్యవర్తిత్వం చేపట్టినప్పటికీ.. యూనియన్ నాయకులు ఓపిక పట్టలేదన్నారు. ఆర్టీసీని బ్లాక్ మెయిల్ చేసే ధోరణితో దసరా, పరీక్షల సమయంలో సమ్మె చేశారని ఆరోపించారు.
"విలీనం" ప్రస్తుతానికే పక్కన పెట్టారు..భవిష్యత్‌లో మళ్లీ అడిగితే..?
యూనియన్ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరుగుతున్న సమ్మె వల్ల ప్రజలు, కార్మికులు, యాజమాన్యం అందరూ నష్టపోతున్నారని ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతల ద్వారా యూనియన్లు ఆర్టీసీని బెదిరించే ధోరణికి పాల్పడుతున్నాయని కౌంటర్‌లో పేర్కొన్నారు. విలీనం డిమాండ్ కూడా ప్రస్తుతానికి మాత్రమే పక్కన పెడుతున్నామని చెప్పడం వారి మొండి వైఖరికి అద్దం పడుతోందన్నారు. భవిష్యత్‌లో మళ్లీ విలీనం డిమాండ్ తెరపైకి రావొచ్చని, ఎప్పుడైనా ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రమాదముందన్నారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!
"అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసు.. ఆయన ఎండీగా బాధ్యతలు చేపట్టి కేవలం 17 నెలలు మాత్రమే అయ్యింది. కనీసం ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదు.. హైకోర్టుకు సమర్పించింది ఫక్తు రాజకీయ అఫిడవిటే" - ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి
ఇదీ చదవండి: ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసు: అశ్వత్థామరెడ్డి
ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ
సమ్మె చేయడం కార్మికుల హక్కే అయిన్పటికీ అది చట్టానికి అనుగుణంగా ఉండాలని సునీల్ శర్మ అన్నారు. ఇలాంటి సమ్మెలను ప్రోత్సహించొద్దని హైకోర్టుకు విన్నవించారు. 40 రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు.