SSC Exams Postponed: ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా... వీటిని తొమ్మిదో తేదీకి మార్చనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మార్పు చేసిన విషయం తెలిసిందే. మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరుగుతాయి. పదో తరగతి పరీక్షలు మే 2 నుంచి 13 వరకు ఉన్నాయి.
ఒకేసారి ఇంటర్, పది పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలకు పోలీసు బందోబస్తు, ఆరోగ్య సిబ్బంది, పరీక్ష కేంద్రాలు, ఇతరాత్ర సమస్యలు ఏర్పడుతున్నందున పది పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వ అనుమతి కోసం పరీక్షల విభాగం పంపించింది. సోమవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. మొదటిసారిగా పదో తరగతి విద్యార్థులకు ఏడు పరీక్షలే నిర్వహిస్తున్నందున పరీక్ష... పరీక్షకు మధ్య ఒకటి, రెండు రోజులు విరామం ఇవ్వనున్నారు.
ఒంటిపూట బడులూ వాయిదానే...
పాఠశాలల ఒంటిపూట నిర్వహణను విద్యాశాఖ ఈసారి వాయిదా వేసింది. సాధారణంగా మార్చి 15 నుంచే ప్రారంభం అవుతాయి. కరోనా కారణంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల నిర్వహణను వాయిదా వేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఏప్రిల్‌లో ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: