సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 11 బ్లాకులు ఉండగా రెండు మినహా మిగతావన్నీ ఇప్పటికే నేలమట్టం అయ్యాయి. పెద్దవైన జే, ఎల్ బ్లాకుల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుందని అంటున్నారు. ఓ వైపు కూల్చివేతలు జరుగుతుండగానే... మరోవైపు శిథిలాల తరలింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. సచివాలయ భవనాల కూల్చివేతతో దాదాపు లక్ష టన్నుల వ్యర్థాలు వస్తాయని అంచనా. వీటిని తరలించేందుకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో కూల్చివేతలు కొనసాగుతున్న సమయంలోనే వ్యర్థాల తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. టిప్పర్ల సహాయంతో శిథిలాలను జగద్గిరిగుట్ట డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. శిథిలాలను టిప్పర్లలోకి లోడ్ చేయకముందే అందులో ఉండే వివిధ రకాల వ్యర్థాలను కొంత మేర వేరు చేస్తున్నారు. శిథిలాల తరలింపు సమయంలో వ్యర్థాలు, దుమ్ము, ధూళి రహదార్లపై పడకుండా... అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. తరలింపు సమయంలో పూర్తిగా కవర్ క్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఐదు వేల టిప్పర్ల వరకు శిథిలాలను తరలించాల్సి ఉంటుందని అంటున్నారు.
మరోవైపు కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం టెండర్లు పిలిచేందుకు రహదార్లు, భవనాల శాఖ సిద్ధమవుతోంది. ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. అందుకు అనుగుణంగా నమూనాను రూపొందించనున్నారు. వచ్చే వారం కొత్త సచివాలయ భవన సముదాయ నమునాకు తుది ఆమోదం లభించునున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్బీ శాఖ సమాయత్తమవుతోంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి