ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో వక్షా బంధన్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. రక్షా బంధన్ పర్వదినం సందర్బంగా విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డులోని 150 ఏళ్లనాటి మర్రిచెట్టుకు విద్యార్థులు రాఖీ కట్టారు. గ్రీన్ క్లైమేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జీవీయంసీ కమిషనర్ సృజన ముఖ్య అతిథిగా హజరై ఈ భారీ వృక్షానికి రాఖీ కట్టారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు చేశారు. పర్యావరణహితంగా ప్రజలు నడుం బిగించి ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలని చైతన్య పరుస్తున్నట్లు గ్రీన్ క్లైమేట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, కాపాడటంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని జీవీయంసీ కమిషనర్ కోరారు.
కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ విలువ..
విశాఖను కాలుష్య కోరల నుంచి బయట పడేయాలంటే చెట్ల పెంపకం ఒక్కటే మార్గమని.. గాలి, నీరు, చెట్టు సంరక్షణ చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయ వృక్ష శాస్త్ర విద్యార్థులు అన్నారు. రక్షా బంధన్ పండుగ రోజు సోదరునికి సంరక్షణగా రాఖీ కట్టి అన్నయ్య ఏ విధంగా తెలియజేస్తాడో అదే విధంగా తాము వృక్షాలను అంతే జాగ్రత్తగా సంరక్షిస్తామని తెలియజేస్తూ.. వక్షాబంధన్ నిర్వహిస్తామని విద్యార్థులు అంటున్నారు. కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ విలువ ఎంతో మందికి ప్రత్యక్షంగా తెలిసింది. ఉచితంగా ఆక్సిజన్‌ను అందించే మొక్కలను ప్రజలు తమ చుట్టూ ఉండే ప్రాంతాల్లో నాటాలని విద్యార్ధులు కోరారు.
పాఠశాల దశ నుంచే..
విశాఖలో వివిధ ప్రాంతాల్లో ఈ తరహాలో విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని గ్రీన్ క్లైమేట్ సంస్ధ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేసేలా నడుం కడుతున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో.. మొక్కలకు ఉన్న ఆవశ్యకతను తెలియజేస్తూ.. అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కాలనీల్లో ప్రచారాలు నిర్వహించి మొక్కలు విరివిగా నాటేలా చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: Vaccination: సోమవారం నుంచి జీహెచ్ఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్