నగరంలో ఏమూలకు వెళ్లినా జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతోన్న జనాలు... బోరుబావి నీళ్లంటే భయపడుతున్నారు. ఎక్కడ బోరు తవ్వినా మురుగు నీరు, ఉప్పునీరే తప్ప తాగేనీరు రాక ఆందోళన చెందుతున్నారు. ఒక్కో కుటుంబం ఏడాదికి 10 నుంచి 20 వేల రూపాయలు మంచి నీళ్ల కోసం ఖర్చు చేస్తోంది.
హైదరాబాద్ జల సంక్షోభంపై కథనాలు:
జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి
నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వుతున్నారు
2020 నాటికి సున్నా స్థాయికి భూగర్భజలాలు
నీటి కోసం బస్తీవాసుల భగీరథ యత్నం
ఇది జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని సుభాష్ నగర్ కాలనీ. ఇక్కడ ఏమూల బోరుబావి తవ్వినా... కాలకూట విషమే ఉబికివస్తోంది. ఏ ఇంట్లో బోరుబావి నీళ్లు చూసినా ఘాటు వాసన వస్తాయి. ఇందుకు కారణం... చుట్టపక్కల ఉన్న వందలాది పరిశ్రమలు. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళ రసానియక వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే భూమిలోకి ఇంకిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలన్నీ రసాయన వ్యర్థ జలాలతో కలిసి కలుషితమయ్యాయి.
బోర్లలో రంగునీళ్లు
సుభాష్ నగర్, జీడిమెట్ల విలేజ్, అయోధ్య నగర్, భాగ్యలక్ష్మీ కాలనీ, అపురూప కాలనీ, సూరారం, గాజుల రామారం, ఇందిరా నగర్, వెంకటేశ్వర్ నగర్, జయరాం నగర్, కల్పనా సొసైటీ, గణేశ్ నగర్ ప్రాంతాల్లో భూగర్భజలాలు విషంగా మారాయి. ఎక్కడ తవ్వినా రంగుమారిన నీళ్లే దర్శనమిస్తాయి. ఇందుకు కుత్బుల్లాపూర్ నగరపాలక సంస్థ ఆవరణలో వేసిన బోరే సజీవ సాక్ష్యం. ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న చేద బావుల్లోని నీరు కూడా రసాయన జలాలతో కలుషితమైపోయాయి.
మంజీరానీళ్లే దిక్కు
గత 20 ఏళ్లుగా చుట్టపక్కలున్న లక్షలాది మంది బోరునీళ్లను వాడటం మానేశారు. వారికి జల మండలి సరఫరా చేసే మంజీరా నీళ్లే దిక్కయ్యాయి. అవి సరిపడా రాకపోవడం వల్ల ఇతర అవసరాలకు ఆ రసాయనాలతో కూడిన నీళ్లనే వాడుతున్నారు. దీనివల్ల పిల్లలు, పెద్దలకు చర్మవ్యాధులు, అంటురోగాలు ప్రబలి ఆస్పత్రుల పాలవుతున్నారు. వర్షాకాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఈఫాక్స్ సాగర్ను 120 ఏళ్ల కిందట బ్రిటిష్ హయాంలో నగర ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం తవ్వించారు. బోయినపల్లి ప్రాంతంలో ఉన్న సైనికులకు ఈ చెరువు నుంచే తాగునీరు సరఫరా అయ్యేది. అయితే ఇది గతం. ప్రస్తుతం ఈ చెరువులో నీళ్లు తాగడానికి, సాగుకు పనికిరాకుండా పోయాయి. 500 ఎకరాలుండే చెరువు కబ్జా కోరల్లో చిక్కి శల్యమైంది. చెరువు చుట్టూ వందలాది పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. వాటి నుంచి వెలువడే రసాయన, ఘన వ్యర్థాలు చెరువు నీళ్లలో కలుస్తున్నాయి. మురుగు నీరు కూడా చెరువులోకి చేరి నీరు కలుషితంగా మారింది. తలాపునే తటాకం నిండా నీళ్లున్నా తాగడానికి పనికిరాకపోవడం వల్ల జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నీళ్లతోనే అవసరాలు తీర్చుకుంటున్నారు. అయినా ఆ నీరు కూడా సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సరఫరాపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడం వల్ల ఈ ప్రాంతాల్లో జలమండలి నిత్యం 18 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తోంది. రోజు విడిచి రోజు నీళ్లు సరఫరా చేస్తున్నా... డిమాండ్ ఎక్కువగా ఉంటుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరిస్తున్నారు.
బోరుబావుల నుంచి వచ్చే నీరు ఇలా కలుషితం అవుతుంటే... జల మండలి సరఫరా చేసే మంచినీళ్లు కూడా కలుషితమవుతున్నాయి. ఏళ్ల నాటి పైపులైన్లు పగిలిపోతుండటం వల్ల మురుగునీరు మంచినీళ్లతో కలిసిపోతుంది. సరఫరా అయ్యే నీరు మురికిగా వస్తుందని, అనారోగ్యాల పాలవుతున్నామని పలు కాలనీల జనాలు వాపోతున్నారు. పారిశ్రామిక ప్రాంతాలతోపాటు మరో 45 ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించింది. 31 ప్రాంతాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్ ఎక్కువగా ఉందని తేల్చింది. ఈ నీళ్లను తాగితే ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.