ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సుమారు 200 కోళ్ల ఫారాలున్నాయి. వీటి ద్వారా సుమారు 7 వేల మంది ఉపాధి పొందుతున్నారు. మార్చిలో ప్రతి రోజు జిల్లాలో 65 నుంచి 70 లక్షల వరకు కోడిగుడ్లు ఉత్పత్తి అయ్యేవని, ప్రస్తుతం 30 నుంచి 35 లక్షలలోపే ఉత్పత్తి అవుతున్నట్టు ఆయా ఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా రెండో దశలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు అనేక మంది కోడిగుడ్లను తమ రోజువారీ ఆహారంలో ఒకటిగా చేర్చారు. ఓ వైపు డిమాండ్ పెరగడం, మరో వైపు వేసవిలో గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో పౌల్ట్రీ పరిశ్రమపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ సీజన్‌లో గుడ్ల ధర కూడా పెరిగింది. కోళ్ల ఫారాల నిర్వాహకులు ఒక్కో గుడ్డును రూ.4.85 చొప్పున విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి అవి చేతులు మారుతుండటంతో ధరలో వ్యత్యాసం కన్పిస్తోంది. వ్యాపారులు పట్టణాల్లోనైతే రూ.5.50కు, గ్రామాల్లో అయితే రూ.6కు విక్రయిస్తున్నారు.
ఒడుదొడుకుల్లో పరిశ్రమ..
పౌల్ట్రీ పరిశ్రమకు సాధారణంగా వేసవిలో ఇబ్బందులుంటాయి. ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా ఇక్కట్లు తప్పడం లేదని, దాణా ఖర్చులు పెరగడం, గిట్టుబాటు కాకపోవడం వల్ల కొంతమంది నిర్వాహకులు పౌల్ట్రీ ఫారాలను మూసివేస్తున్నారు. మార్చిలో సోయాబీన్స్ ధర కిలో రూ.35కు లభించగా, నేడు రూ.70 ధర పలుకుతోందని, ఇక కోళ్లకు ఎలా దాణా పెట్టగలమని వారు వాపోతున్నారు. గుడ్డు ధర పైసల్లో పెరుగుతుంటే దాణా ఖర్చు మాత్రం రూపాయల్లో పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోళ్ల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదాయ వనరులు పెరగకపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోందని పౌల్ట్రీ ఫెడరేషన్ గుంటూరు రీజియన్ ఛైర్మన్ యలవర్తి సురేష్‌బాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హుజూరాబాద్ నేతలందరూ తెరాస వైపే ఉన్నారు: గంగుల