లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్, మే నెలలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రీడింగ్ నమోదు చేయలేకపోయిందని సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వాడిన కరెంటు బిల్లు ఆధారంగా ఏప్రిల్, మే నెలలో ఆన్లైన్ ద్వారా తాత్కాలిక బిల్లులు పంపించామని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపుల నేపథ్యంలో జూన్ నెలలో రీడింగ్ నమోదు చేసి బిల్లులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ జూన్ బిల్లులో ఏప్రిల్, మే నెలకు సంబంధించిన బిల్లులను సర్దుబాటు చేసినట్లు తెలిపారు.
సందేహాలు నివృత్తి చేసేందుకు..
మూడు నెలలకు సంబంధించి ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల బిల్లులు అధికంగా వచ్చాయని కొంతమంది వినియోగదారులు ఆందోళన చెందుతున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిందన్నారు. బిల్లులపై సందేహాలు నివృత్తి చేసేందుకు అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బిల్లుకు సంబంధించిన సమస్యల్ని సంస్థ దృష్టికి తేవాలని కోరారు.
బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా...
ఈ-మెయిల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అందుకున్న ఫిర్యాదులను రెండు పని దినాల్లో పరిష్కరించి బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా వినియోగదారునికి జవాబు పంపాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారులు తమ విద్యుత్ వాడకం బిల్లులపై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే తమ బిల్ పైభాగంలో ముద్రించిన ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్- ఈఆర్ఓను సంప్రదించి.. పైన పేర్కొన్న సంస్థ ఈమెయిల్/ ట్విట్టర్/ పేస్‌బుక్‌కు పంపి సమస్య పరిష్కరించుకోవచ్చని రఘుమారెడ్డి తెలిపారు. వినియోగదారులు చెల్లించే బిల్లులపైనే సంస్థ మనుగడ ఆధారపడి ఉందన్న ఆయన... సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఇవీ చూడండి: వడ్డీలేని, పావలావడ్డీ రుణాలకు నిధుల విడుదల