ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి దేశమంతా తెలిసిందే. ఎన్నో నాటకీయ పరిస్థితుల అనంతరం ఔషధ పంపిణీకి అనుమతులు లభించి... ఆ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజకీయంగానూ ఆ మందు వేడి రాజేసింది. తయారీ, పంపిణీ విషయమై.... మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Somireddy vs Kakani) పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఆనందయ్య మందు అమ్మకం పేరిట 'చిల్‌డీల్.ఇన్' అనే వెబ్‌సైట్ తయారు చేసింది.... నెల్లూరుకు చెందిన శేశ్రిత అనే సంస్థ అంటూ సోమిరెడ్డి ఆరోపించారు.
సోమిరెడ్డి ఆరోపణలకు కాకాణి ఘాటుగా బదులిచ్చారు. ఎప్పటికప్పుడు ప్రతి విమర్శకూ కౌంటర్ ఇస్తున్నా... ఏదో ఒక విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆక్షేపించారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఆనందయ్య కోరుతున్నారు. తమ డేటాను తస్కరించారని, పూర్తిగా అభివృద్ధి చేయని వెబ్‌సైట్‌ను సోమిరెడ్డి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదకుమార్ ఫిర్యాదు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణల వల్ల సంస్థకు చెడ్డపేరు వచ్చిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కరోనా మందుతో వైకాపా నకిలీ వ్యాపారం చేస్తోందని... తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేసి, ప్రజల తరఫున ప్రశ్నించిన సోమిరెడ్డి పై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అరాచకాన్ని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేలా కేసులు పెట్టడమేంటన్నారు. ప్యాకెట్ 167రూపాయలకు అమ్మేందుకు శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ ప్రయత్నించడం వాస్తవం కాదా అని అచ్చెన్న నిలదీశారు. అనుమతి రాకముందే ఆనందయ్య మందు అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలేవని ప్రశ్నించారు. సోమిరెడ్డిపై నమోదు చేసిన కేసుల్ని వెంటనే ఎత్తివేసి, దొంగచాటుగా మందు అమ్మేందుకు యత్నించిన వారిపై కేస నమోదు చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.