Rythu Bandhu Scheme : రైతుబంధు నిధులు జమ అయినప్పుడు లేదా పంట రుణం డబ్బు పడినప్పుడు తప్ప మిగతా సమయాల్లో కొందరు రైతులు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఖాతాలు బ్లాక్ అవుతున్నాయని బ్యాంకు ఉన్నతాధికారి వివరించారు. ఈ కారణంగానే ప్రస్తుతం రైతుబంధు పథకం కింద ఆన్‌లైన్‌లో జమ చేసిన నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి ఖాతాల వివరాలను గ్రామస్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓ)కు వ్యవసాయశాఖ పంపుతోంది.
రైతులతో, బ్యాంకులతో మాట్లాడి ఖాతాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించింది. వీటికితోడు కొందరు రైతులు ఆధార్ సంఖ్య, ఇతర వివరాలు సరిగా ఇవ్వకపోవడంతో నగదు జమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల 2.48 లక్షల మంది రైతుల ఖాతాలు సరిగా పనిచేయడం లేదని వ్యవసాయశాఖ పరిశీలనలో గుర్తించారు.
69% మందికి 41% నిధులు.. ఈ వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో 1,50,43,606 ఎకరాలు కలిగిన 68.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7521.80 కోట్ల సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకూ 47.09 లక్షల(69%) మంది రైతుల ఖాతాల్లో రూ.3133.21 కోట్లు జమయ్యాయి. మొత్తం నిధుల్లో ఇది 41.65 శాతం. జూన్ 28న ఎకరాలోపు, 29న 2 ఎకరాల్లోపు, 30న 3 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. 3 ఎకరాలకు పైగా భూమి ఉన్న మిగిలిన(31%) మంది ఖాతాల్లోకి రూ.4388.59 కోట్ల (58.35%) నిధులు జమ చేయాల్సి ఉంది.
సంక్షిప్త సందేశంతో తంటాలు.. పథకం సొమ్ము జమ చేసే రోజున సంబంధిత రైతుల సెల్‌ఫోన్‌కు ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు సీఎం కేసీఆర్ పేరుతో సంక్షిప్త సందేశాలు(ఎస్‌ఎంఎస్) వస్తున్నాయి. ఇవిరాగానే కొందరు రైతులు బ్యాంకుకెళ్తే సొమ్ము ఇంకా జమ కాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. అదేరోజు రాత్రి సొమ్ము జమవుతోంది. తమకు ఎస్‌ఎంఎస్ వచ్చిందని, సొమ్ము ఎందుకు జమ కాలేదని కొందరు రైతులు ఫోన్ చేస్తున్నారని లేదా రైతువేదికల వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారని ఏఈఓలు తెలిపారు. ఖాతాలో సొమ్ము జమ అయిన తర్వాత ఎస్‌ఎంఎస్‌లు పంపితే ఈ సమస్య ఉండదని వారు అభిప్రాయపడ్డారు.