వరద నీటి కాలువ ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమాజీగూడ కార్పొరేటర్ వనం సంగీత భర్త శ్రీనివాస్‌యాదవ్ నిరసనకు దిగారు. బీఎస్ మక్తా నుంచి ఎంఎస్ మక్తా మీదుగా హుసేన్‌సాగర్‌లోకి వరద నీరు వెళ్లేందుకు రెండు కోట్ల వ్యయంతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టింది. ఆరు నెలల కిందట పనులు ప్రారంభించినప్పటికీ... అధికారుల అలసత్వం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయని వనం శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు.
రెండు రోజుల నుంచి నగరంలో కురుస్తున్న వర్షానికి వరద నీరు ఇళ్లలోకి వచ్చి... బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అధికారులు, కాంట్రాక్లర్లు స్పందించపోవడం వల్లే వరద నీటి కాలువలో దిగి నిరసన చేయాల్సి వచ్చిందన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా... రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి.. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. బస్తీ వాసులను వరద నీటి నుంచి రక్షించాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.