దేశ రాజధాని దిల్లీని దిగ్బంధించి సాగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా హైదరాబాదులో సైతం నిరసనలు మిన్నంటుతున్నాయి. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎస్‌సీసీ) పిలుపు మేరకు రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సంఘీభావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, రవి కన్నెగంటి, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య తదితరులు హాజరయ్యారు.
వైవిధ్య భరితంగా ప్రదర్శనలు
తెలంగాణ ప్రజా అసెంబ్లీ భాగస్వామ్య సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైవిధ్యంగా సాగింది. కవులు, రచయితలు తమ రచనలతో రైతులకు సంఘీభావం తెలిపారు. చిత్రకారులు బొమ్మలు, కార్టూన్లు వేసి కేంద్ర వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. కళాకారులు ఆటపాటలతో కళారూపాలు ప్రదర్శించారు. రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు.
సంపూర్ణ మద్దతు
ప్రధాని మోదీ గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కూడా హరిస్తూ పరిపాలన చేస్తున్నారని ఏఐకేఎస్‌సీసీ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ ఉద్యమం నిలబెట్టడం కోసం అందరి భాగస్వామ్యం, సంఘీభావం అవసరమని స్పష్టం చేశారు. పది రోజులుగా దిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే... కేంద్రం స్పందించడం లేదని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండి రైతన్నల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ చట్టాలను రద్దు చేయాలని అల్లం నారాయణ డిమాండ్ చేశారు. దిల్లీ పోరాటానికి 8న సంఘీభావంగా జరిగే భారత్ బంద్‌కు పాత్రికేయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: వరద సాయం అందించపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం: కోమటిరెడ్డి