హైదరాబాద్లోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సమస్యలకు నెలవుగా మారింది. వైద్య సిబ్బంది కొరత, చికిత్స అత్యవసర విభాగాలు లేకపోవడం వల్ల ఆసుపత్రికి వచ్చిన కొందరు రోగులు తీవ్ర ఇబ్బందులు పడగా... మరికొందరి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
గతంలో నిత్యం 200 నుంచి 400 మంది రోగులు ఆసుపత్రికి వచ్చేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య 1500కి చేరింది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మీర్పేట్ పరిధిలో ఈ ఆసుపత్రి ఒక్కటే ఉండటం వల్ల నెలకు సుమారు 5000 గర్భణీలు వైద్య సేవల కోసం వస్తారు. సోమ, బుధవారాల్లో ఆసుపత్రిలో గర్భిణుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కరోనా పరిక్షల కోసం వచ్చేవారు సైతం ఎక్కువే. పెరుగుతున్న రోగుల సంఖ్యతో పాటు ఆసుపత్రిలో సేవలు సైతం మెరుగుపడాల్సింది పోయి... తరుగుపడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలు పడిగాపులు పడుతున్నారు. సౌకర్యాలు, మందులు లేకపోవటం వల్ల వేరే ఆసుపత్రి కోసం సుదూర ప్రాంతాలకు పయనమవుతూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. నగరంలో ముందుగా ఖైరతాబాద్... ఆ తర్వాత వనస్థలిపురం సెంటర్లను ప్రారంభించారు. మొదట్లో అన్ని రకాల పరీక్షలతోపాటు వైద్యులు, మందులు అందుబాటులో ఉండేవి. కానీ... ఏడాది కాలంగా ఈ వెల్నెస్ సెంటర్లలో సేవలు క్రమంగా నిలిచిపోతున్నాయి. పరీక్షలకు నారాయణగూడ ఐపీఎం సెంటర్కు పంపిస్తున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వినియోగించే షుగర్, బీపీ మందులు సైతం ఉండటం లేవని సిబ్బంది చెప్పటం పరిపాటిగా మారింది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులు, మందుల కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రకాల పరీక్షల విభాగాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.