Siricilla Rajaiah News: కోడలు, మనవళ్ల మృతి కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసును నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు మంగళవారం కొట్టివేసింది.
ఏం జరిగిందంటే..
2015 నవంబరు 4న సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), ఆయాన్(3), శ్రీయాన్(3) అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవ దహనమయ్యారు. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాజయ్య దంపతులతో పాటు పలువురిపై 498ఏ, 306, 176 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనీల్, రెండో నిందితుడిగా రాజయ్య, మూడో నిందితురాలిగా రాజయ్య భార్య మాధవి, నాలుగో నిందితురాలిగా అనీల్ రెండో భార్య సనాపై కేసు నమోదైంది.
రాజయ్యతో పాటు ఆయన కుటుంబం కొంతకాలం వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా గడిపారు. మృతులది హత్య కాదని.. గ్యాస్ లీకవడంతోనే ప్రమాదం జరిగిందని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణులు అప్పట్లో నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. కేసును విచారించిన న్యాయస్థానం.. నిందితులపై ఆరోపణలను నిరూపించే బలమైన ఆధారాలు లేవంటూ రాజయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి:High court: హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు.. రేపే ప్రమాణ స్వీకారం