Shortage of Competitive Books :ఉద్యోగాల భర్తీ ప్రకటన వేళ.. పోటీపరీక్షల పుస్తకాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజా సమాచారం జోడించినవి అందుబాటులో లేక పుస్తక దుకాణాల చుట్టూ యువత కాళ్లరిగేలా తిరుగుతోంది. కొవిడ్ కారణంగా పడిపోయిన వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు ముద్రణదారులకు కాలం కలిసివచ్చింది. అయినా కాగితం కొరత, ధరలు ఇబ్బందిపెడుతున్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మెటీరియల్‌ను అందించలేకపోతున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రవేశపరీక్షల శిక్షణ కేంద్రాలున్న ప్రాంతాలు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర నగరాల్లోనూ ఇదే పరిస్థితి.. మరోవైపు లభ్యత ఉన్న పుస్తకాల ధరలూ భారీగా పెరిగాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
- Competitive Books Shortage in Telangana : టీచర్ పోస్టులకు పోటీ పడుతున్నవారు 1-10 తరగతుల తెలుగు మాధ్యమ పుస్తకాల కోసం అన్వేషిస్తున్నారు. లభ్యత లేదనే సమాచారమే వస్తోందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలుగు అకాడమీలో కూడా కొన్ని పుస్తకాలే అందుబాటులో ఉన్నాయని, కోఠిలో సెకండ్‌హ్యాండ్ పుస్తకాల షాపుల్లోనూ అన్ని రకాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష మెటీరియల్‌కు డిమాండ్ భారీగా ఉన్నా.. దుకాణాల్లో ప్రముఖ పబ్లిషర్స్‌కు చెందిన తాజా పుస్తకాలు అందుబాటులో లేవు.
- గతేడాదితో పోల్చితే కొన్ని పుస్తకాలపై 15 శాతం ధర పెరిగిందని నిరుద్యోగులు చెబుతున్నారు. మరింత తాజా ముద్రణలు వస్తే ఇంకెంత ధర ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఆలస్యంగా అకాడమీ.. తెలుగు మాధ్యమం పుస్తకాలు : దేశవ్యాప్తంగా కాగితం ధరలు, ప్రపంచవ్యాప్తంగా ప్రింటింగ్ సామగ్రి (రంగులు, అల్యూమినియం ప్లేట్లు) ధరలు భారీగా పెరిగాయి. ప్రధానంగా కాగితం కొరత తీవ్రంగా ఉన్నట్లు ముద్రణదారులు చెబుతున్నారు. కొత్త పుస్తకాల ముద్రణా ఆచితూచి చేపడుతున్నారు. అందుకనే పాఠశాల విద్య, తెలుగు అకాడమీ పుస్తకాల ముద్రణ ప్రక్రియ టెండర్ల దశలోనే ఉంది. 1-10 తరగతులు, ఇంటర్ తెలుగు మాధ్యమ పుస్తకాలు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందే అవకాశాలు లేవు. ఇది పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారిపైనా ప్రభావం చూపనుంది. మార్కెట్లో ఈ పుస్తకాలకు గిరాకీ భారీగా ఉంది. పంజాబ్, తమిళనాడు, ఏపీ, కర్ణాటకల నుంచి తెలంగాణకు కాగితం రావాల్సి ఉంది. అక్కడి ఉత్పత్తి స్థానిక అవసరాలకే సరిపోతుండటంతో మనకు రావడం లేదని తెలంగాణ వెబ్, ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి తెలిపారు. ముద్రణ ధరలు పెరిగినందున పుస్తకాల ధరలు పెంచకతప్పడం లేదన్నారు.
గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నవారు ప్రసిద్ధ ముద్రణ సంస్థల మెటీరియల్ కోసం వెతుకుతున్నా పాత పుస్తకాలే దొరుకుతున్నాయి. కొత్తవి వస్తాయని విక్రయకేంద్రాలవారు చెప్తున్నారని, గ్యారంటీ మాత్రం ఇవ్వడం లేదన్నది యువత ఆవేదన.
పేరొందిన పబ్లిషర్స్, అకాడమీల నుంచి ముద్రణలు రావాల్సినవి...
- గ్రూప్స్‌కు సంబంధించిన వాటిలో సోషియాలజీ, జనరల్ సైన్స్‌కు సంబంధించినవి
- తాజా కరెంట్ అఫైర్స్
- ఇంటర్ తెలుగు అకాడమీ
- 1-10 తరగతుల తెలుగు మాధ్యమ పుస్తకాలు
ధరలు భారీగా పెరిగాయి : "నేను గ్రూప్స్‌కి ప్రిపేరవుతున్నాను. గతంతో పోల్చితే మెటీరియల్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఏడాది క్రితం రూ.300 ఉన్న కొన్ని పుస్తకాల ధర రూ.400 వరకు పెంచారు. మేగజీన్లవీ 15శాతం పెరిగాయి. పుస్తకాలన్నీ కలిపి ఒక్కొక్కరిపై అదనంగా రూ.2వేలకు పైగా భారం పడుతోంది."
- రవికిశోర్ రెడ్డి, చందానగర్
తెలుగు అకాడమీలో కొన్ని లేవు : "సోషియాలజీకి చెందిన రెండు పుస్తకాలు మార్కెట్లో లేవు. తెలుగు అకాడమీలో ఇంటర్‌కు సంబంధించి రెండు పుస్తకాలు లేవని చెబుతున్నారు. త్వరలో వస్తాయంటున్నారు. తాజా సమాచారం ఉన్న కొన్ని పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు."
- వెంకటనారాయణ, ఖమ్మం