Sheep distribution scheme Cash transfer process started munugode: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం అమల్లో భాగంగా నగదు బదిలీకి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎంపిక చేసిన ప్రభుత్వం... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నికల వేళ... ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 5,800 మంది గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో ఎన్నికల కోడ్ రాక ముందే నగదు బదిలీ ప్రక్రియ పూర్తైంది. గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తై సాయం కోసం ఎదురు చూస్తున్న ఒక్కో లబ్ధిదారుడు ఖాతాలో 1.58 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 93.78 కోట్ల రూపాయలు నగదు బదిలీ అయ్యాయి.
సెప్టెంబర్ 30 అర్ధరాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ... పశుసంవర్థక శాఖ అధికారులు మూడు రోజులపాటు చాలా గోప్యంగా ఉంచారు. ఇంతలోనే సంబంధిత అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని ఎంపీడీవోల ద్వారా బ్యాంకులకు ఉత్తరాలు వెళుతున్నాయి. 20 గొర్రెలు, ఒక విత్తనం పొట్టేలు యూనిట్ కొనుగోలు చేసి చూపితేనే బ్యాంకుల నుంచి లబ్ధిదారులు సొమ్ము ఉపసంహరించుకునేందుకు వెలుసుబాటు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు వెళ్లడంతో... తాత్కాలికంగా ఉపసంహరణ నిలిపేశారు.
ఇటీవల దసరా, నవరాత్రులు, బతుకమ్మ సెలవులు దృష్ట్యా... ప్రభుత్వ ఉన్నత స్థాయి పూర్తి మార్గదర్శకాలు వెలువడాల్సి ఉండటంతో... అంతా నిరీక్షిస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో రైతుబంధు పథకంపై ఇలాగే చర్చ జరిగిన తరుణంలో ఆన్‌గోయింగ్ స్కీం కాబట్టి సాంకేతిక సమస్యలు ఏమీ లేవని ఈసీ ధృవీకరించడంతో అప్పట్లో సాఫీగా రైతు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమైంది.
మొదట్లో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమైన వెంటనే కొంతమంది లబ్ధిదారులు యూపీఐ ద్వారా కొంత నగదు వివిధ రూపాల్లో ఖర్చు చేశారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న బ్యాంకర్లు అప్రమత్తమై నగదు ఉపసంహరణ నిలిపేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ రాంచందర్‌ను కలిసి స్పష్టత సహా ఆన్ గోయింగ్ స్కీం కాబట్టి యూనిట్ కొనుగోలుకు నిధులు డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరేందుకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు. గొర్రెల పంపిణీ పథకం నగదు బదిలీ ప్రక్రియ మునుగోడు నియోజకవర్గంలో వియజంతమైతే రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంపిణీలో అమలు చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.
ఇవీ చదవండి: