రాష్ట్రవ్యాప్తంగా ఏడోరోజు లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పదింటి వరకు రోడ్ల మీద జనాలు కొంత హడావుడి చేసినా... పదింటి వరకు రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. అనవసరంగా రోడ్లమీదికి వచ్చే వారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు. వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు.
నిబంధనలు పాటించండి...
హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో లాక్‌డౌన్ అమలు తీరును సీపీలు నేరుగా పర్యవేక్షించారు. చైతన్యపురిలో పర్యటించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ .. లాక్‌డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆంక్షల అమలు తీరును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు.
నిర్మానుష్యంగా రోడ్లు...
ఖమ్మంలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతుంది. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలకు తాళాలు పడుతున్నాయి. ఖమ్మంలోని పలు వ్యాపార కేంద్రాలైన గాంధీచౌక్, కస్బా బజార్, కమాన్‌బజార్, మార్కెట్ ఏరియా, బోమ్మన సెంటర్, స్టేషన్ రోడ్ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.
అందరూ సహకరించాలి...
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు మధ్య లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సిరిసిల్లలో లాక్‌డౌన్ పరిస్థితులనుజిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. వీధుల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతూ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పికెట్లను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బయటకి వచ్చిన 71 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సుకై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
వాహనాలు సీజ్ చేస్తాం...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ అమలును జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు పాలనాధికారి నటరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ పురపాలక సంఘం పరిధిలో జనసంచారం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అత్యవసరం ఉంటే తప్పా బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఒకవేళ అత్యవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మాస్కు లేకుండా ఎవరూ బయటకు రావద్దని అదనపు పాలనాధికారి సూచించారు.
అక్కడక్కడా జనాలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించి... పోలీసుల చేత చివాట్లు తింటున్నారు. మిగతా అన్ని చోట్ల లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ... కరోనా కట్టడిలో ప్రజలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.