AP New Judges Oath taking : ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు కొత్త జడ్జీలు గురువారం ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణతో ప్రమాణం చేయించనున్నారు.
గవర్నర్ అధికారం బదలాయించడం ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) మిగిలిన న్యాయమూర్తులను ప్రమాణం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర మాతృమూర్తి కన్నుమూసిన కారణంగా సీజే ప్రమాణం చేయించే కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. దీంతో గవర్నరే ప్రమాణం చేయించనున్నారు.
కొత్తగా ఎంపికైన జేసీజేలకు పోస్టింగులు.. జూనియర్ సివిల్ జడ్జీలుగా (జేసీజే) కొత్తగా ఎంపికైన 62 మందికి రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో పోస్టింగ్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు జేసీజేలుగా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న కొందరిని బదిలీ చేసింది. కొత్తగా నియమితులైన 62 మంది(నేరుగా నియామకం 52, బదిలీల ద్వారా 10 పోస్టులు)జేసీజేలు ఈ నెల 17వతేదీ లోపు బాధ్యతలు స్వీకరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్(విజిలెన్స్) గంధం సునీత బుధవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు.
ఆర్‌జీగా లక్ష్మణరావుకు పూర్తి అదనపు బాధ్యతలు.. హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్)గా పనిచేస్తున్న వై.లక్ష్మణరావుకు రిజిస్ట్రార్ జనరల్‌గా(ఆర్‌జీ) పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగించారు. రిజిస్ట్రార్(విజిలెన్స్)గా పనిచేస్తున్న గంధం సునీతకు రిజిస్ట్రార్(ఐటీ-సీపీసీ) ఎఫ్‌ఏసీ ఇచ్చారు. రిజిస్ట్రార్(నియామకాలు)గా పనిచేస్తున్న ఎ.గిరిధర్‌కు రిజిస్ట్రార్(పరిపాలన)గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు హైకోర్టు ఆర్‌జీ బుధవారం ఉత్తర్వులిచ్చారు.
హైకోర్టు ఆర్‌జీ, రిజిస్ట్రార్(ఐటీ-సీపీసీ), రిజిస్ట్రార్(పరిపాలన)గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు న్యాయాధికారులు.. ఎ. వెంకట రవీంద్రబాబు, బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ (బీవీఎల్‌ఎన్) చక్రవర్తి, దుప్పల వెంకటరమణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు వారు నిర్వహించిన బాధ్యతలను మరో ముగ్గురు న్యాయాధికారులకు అప్పగించారు.