Smart Dustbins in Vijayawada ఏపీలోని విజయవాడ నగరాన్ని స్వచ్చ భారత్‌లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. నగరంలో చెత్త ఉత్పత్తి రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. చెత్త తరలించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా మురికివాడలు, వాణిజ్య ప్రాంతాల్లో చెత్త సేకరణ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యల నివారణ కోసం విజయవాడ కార్పొరేషన్ అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్మార్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు.
ప్రజలు రోడ్లపై చెత్తను పోయడాన్ని తగ్గించడానికి కార్పొరేషన్ అధికారులు చేపపట్టిన వినూత్న ఆలోచనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బయో వ్యర్థాలు, పొడి వ్యర్థాలను వేరు చేయడానికి ఆకుపచ్చ, పసుపు బిన్‌లను, ప్లాస్టిక్ వ్యర్థాల కోసం నీలి రంగు బిన్‌లను ఏర్పాటు చేశారు. ఈ చెత్త డబ్బాలు 90 శాతం నిండగానే కార్పొరేషన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించేలా వీటిని రూపొందించారు. ఈ స్మార్ట్ బిన్‌లు 10 అడుగుల పొడవుతో.. సుమారు 6 అడుగులు భూగర్భంలో ఉంటాయి. వీటి వల్ల పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బంది ఉండదని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దిన్‌కర్ తెలిపారు. నగరంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వార్ట్ బిన్స్ తమ తమ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నట్లు కమిషనర్ తెలిపారు.