రాష్ట్రంలో చాలామందికి వృద్ధాప్యంలోనూ కాయకష్టం తప్పట్లేదు. వ్యవసాయం, సొంత వ్యాపారం వంటి వ్యాపకం అవసరమవుతోంది. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 43.3 శాతం మంది పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. జాతీయ కుటుంబ సంక్షేమశాఖ, అంతర్జాతీయ జనాభాశాస్త్ర అధ్యయన కేంద్రం (ఐఐపీఎస్), మధ్య వయస్కులు, వృద్ధుల ఆరోగ్య, సంరక్షణ కార్యక్రమం సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. పురుషులతో పాటు మహిళలూ ఏదో ఒక పనిచేస్తున్నారు.
వ్యవసాయ రంగంలో 66 శాతం మంది, వ్యవసాయేతర పనుల్లో 16 శాతం మంది ఉన్నారు. ఈ వయసులోనూ సగటున నెలకు రూ.5,792 ఆదాయం పొందుతున్నట్లు వెల్లడైంది. పురుషులతో పోల్చితే మహిళల ఆదాయం సగం కన్నా తక్కువగా ఉంది.
* 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 15.1 శాతం మందికి మాత్రమే విశ్రాంత ఉద్యోగ, ఈపీఎఫ్‌వో పింఛన్లు అందుతున్నాయి. వృద్ధాప్య, వితంతు పింఛన్లపై 35 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. 24.8 శాతం మంది వృద్ధాప్య, 41.3 శాతం మంది వితంతు పింఛన్లు పొందుతున్నారు. రాయితీ పథకాలు ఉన్నప్పటికీ వీటిపై అవగాహన లేకపోవడంతో 5 శాతం మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు.
* వ్యక్తిగత విషయాలను 77.2 శాతం మంది జీవిత భాగస్వాములతో, 29.3 శాతం మంది పిల్లలు, మనవలు, మనవరాళ్లతో పంచుకుంటున్నారు. ఇంట్లో కీలక విషయాలకు సంబంధించి 86 శాతానికి పైగా వృద్ధులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
* ముదుసరుల్లో 18.8 శాతం మందికి ధూమపానం అలవాటుంది. 8.1 శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు. 15.8 శాతం మంది ఊతకర్రలు వాడుతున్నారు. 42.3 మందికి కంటి అద్దాలు తప్పనిసరి అయ్యాయి. 31.6 శాతం మందికి వైద్య బీమా ఉంది.
- ఇదీ చూడండి : అభాగ్య వృద్ధులపై అమానవీయం..!